అందుకే సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పుకోవట్లేదు : చైతన్య జొన్నలగడ్డ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా, చైతన్య జొన్నలగడ్డ కీ రోల్ చేసిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్‌లో సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. శనివారం చైతన్య జొన్నలగడ్డ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బబుల్గమ్, హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించాను కానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’లో నేను చేసిన వెంకన్న పాత్రకు, సినిమాకూ మంచి స్పందన లభిస్తుండటం హ్యాపీ. నేను లీడ్ రోల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా రావాల్సింది. ఆ సినిమా పనుల్లో ఉన్న నాకు దివ్యాంగుడు వెంకన్న రోల్ చేసే చాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేశాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పి, తన పేరు ఉపయోగించుకోవాలనుకోలేదు. ఏ సపోర్ట్ లేకుండా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే సిద్ధును మా సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ కు పిలవడం లేదు.‘రాజు వెడ్స్ రాంబాయి’లో నా నటనను మెచ్చుకుంటూ సిద్ధు మెసేజ్ చేశాడు. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. పవన్ డైరెక్షన్లోనే రాజశేఖర్‌గారు హీరోగా చేస్తున్న ‘మగాడు’ సినిమాలో నటించాను’’ అన్నారు. అవకాశం వస్తే సిద్ధుతో కలిసి నటిస్తా’ అని అన్నారు. .