ధురంధర్‌పై కామెంట్‌.. ఆ బడ్జెట్‌లో మనోళ్లు నిర్మించడం కష్టం | BVS Ravi Comments On Dhurandhar Movie Budget | Sakshi
Sakshi News home page

ధురంధర్‌ తెలుగులో కష్టం.. బివిఎస్ రవి సెన్సేషన్‌ కామెంట్‌

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:41 AM

BVS Ravi Comments On Dhurandhar Movie Budget

టాలీవుడ్‌ ప్రముఖ రచయిత బివిఎస్ రవి అరుదుగా మీడియాతో మాట్లాడుతారు. కానీ, ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలుకొడతారని ఆయనకు గుర్తింపు ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ధురంధర్‌ సినిమా బడ్జెట్‌ గురించి మాట్లాడారు. ధురంధర్‌ సినిమా టాలీవుడ్‌లో అంత తక్కువ బడ్జెట్‌లో నిర్మించడం చాలా కష్టమని చెప్పారు. టాలీవుడ్‌లో సినిమా ప్రారంభించాక ప్రణాళికా లోపం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

బాలీవుడ్‌లో ధురంధర్‌ రెండు భాగాల కోసం సుమారు రూ. 260 కోట్లు పెట్టారు. ఇప్పుడు ఇదే బడ్జెట్‌ గురించి రచయిత బివిఎస్‌ రవి ఇలా అన్నారు. అదే బడ్జెట్‌లో తెలుగులో నిర్మించడం సాధ్యం కాదని ఆయన గట్టిగా పేర్కొన్నారు. టాలీవుడ్‌లో కనక ధురంధర్‌ మూవీ నిర్మించి వుంటే.. కనీసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టించేవారని చెప్పారు. ఆపై క్వాలిటీ తక్కువగా ఉన్న ప్రోడక్ట్ చేతిలో పెడతారని  ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితులు అలా తయారయ్యాయని ఓపెన్‌గానే రవి అన్నారు.

'దర్శకుడు ఆదిత్య ధర్‌ సుమారు ఎనిమిది గంటలకు పైగానే ఫుటేజ్ చిత్రీకరించాడు. దాని కోసం అతను ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత పరిశోధన చేసి ఉంటాడో ఒక్కసారి ఊహించండి. అంత ఖర్చు పెట్టడానికి అతను తన నిర్మాతలను ఎలా ఒప్పించగలిగాడు..? పొరపాటు జరిగితే సాధారణ నిర్మాతల పతనానికి 'ధురంధర్‌' ఆరంభం అయ్యేది. ఈ మూవీ నిర్మాతలు రూ.260 కోట్లలోపే బలమైన నటులను ఎంపిక చేసుకుని అమోఘమైన ఫైట్‌లు, సినిమాలో రణవీర్ సింగ్ విలాసవంతమైన ఇల్లు, ఇతర అద్భుతమైన లొకేషన్లతో రెండు సినిమాలు తీశారు.' అని బివిఎస్‌ రవి చెప్పుకొచ్చారు.

రచయిత బివిఎస్ రవి చేసిన వ్యాఖ్యలను చాలామంది సమర్ధిస్తున్నారు. కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఆయన చెప్పింది నిజమేనని అంటున్నారు. మనోళ్ల దృష్టి సినిమా కంటెంట్‌ మీద కాకుండా గ్రాండ్‌ ఎంట్రీ పేరుతో అనోసరమైన ఖర్చులు పెడుతారనే టాక్‌ ఉంది. ధురంధర్‌ రెండు భాగాలు కూడా 20నెలల్లోనే నిర్మించారు. కానీ తెలుగులో మాత్రం పాన్‌ ఇండియా పేరుతో ఏకంగా ఐదు సంవత్సరాల పాటు తీస్తారు. తీరా థియేటర్స్‌లో బొమ్మ పడితే కనీసం మూడోరోజు కూడా ప్రేక్షకులు కనిపించరు. ఆపై పార్ట్‌-2 అంటూ ఎండ్‌ కార్డ్‌తో ఒక ట్విస్ట్‌ ఇచ్చి బయటకు పంపుతారు.

(వీడియో క్రెడిట్‌ గుల్ట్‌)

 

Advertisement
 
Advertisement
Advertisement