
బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ముకుల్ దేవ్ (Mukul Dev) బాలీవుడ్ మూవీ ‘దస్తక్’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు.
ముకుల్ దేవ్‌కి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు.
‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ చిత్రాల్లో నటించిన రాహుల్ దేవ్ సోదరుడే ముకుల్. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
చదవండి: కన్నప్ప టీమ్‌కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్