
‘కన్నప్ప’చిత్ర బృందానికి మంచు మనోజ్(Manchu Manoj) క్షమాపణలు చెప్పారు. భైరవం సినిమా ఈవెంట్‌లో ‘శివయ్యా..’ అనే డైలాగును వేరేలా వాడడం తప్పని ఒప్పుకున్నాడు. ఒకడు చేసిన తప్పుకు సినిమా మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని..ఏదో ఎమోషనల్‌గా అలా అన్నానని చెబుతూ కన్నప్ప టీమ్‌కు సారీ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిదంటే..
శివయ్యా... అని పిలిస్తే రాడు
మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఏపీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఇబ్బందులు ఉన్న సమయంలో ఆ పరమ శివుడే డైరెక్టర్ విజయ్ రూపంలో వచ్చి భైరవం సినిమా ఆఫర్ ఇచ్చాడని చెబుతూ.. ‘ శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలో వస్తాడు’ అంటూ పరోక్షంగా కన్నప్ప సినిమాలో మంచు మనోజ్ చెప్పిన శివయ్యా డైలాగ్‌పై కౌంటర్ వేశాడు. అదికాస్త నెట్టింట బాగా వైరల్ అయింది.
సినిమా ఒకడిది కాదు..
తాజాగా శివయ్య కామెంట్స్‌పై మంచు మనోజ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శివయ్యా అనే డైలాగ్‌పై సెటైర్లు వేయడం తప్పని ఒప్పుకున్నాడు. ‘సినిమా అంటే ఒక్కడికాదు.. అందులో ఎంతో మంది పని చేస్తారు.. ఆ డైరెక్టర్,మ్యూజిక్ డైరెక్టర్..ఇలా ఎంతో మంది కష్టపడతారు. మోహన్ లాల్.. ప్రభాస్.. ఇలా అందరూ కష్టపడి సినిమా చేశారు.. ఒక్కరికి కోసం సినిమాను విమర్శించడం తప్పే. ఒక సినిమా వాడిగా నేను అలా అనకూడదు. ఎప్పుడైనా ఏదైనా అని ఉంటే.. కన్నప్ప టీంకి క్షమాపణలు కోరుతున్నాను. అవి ఎమోషనల్‌గా చేసిన కామెంట్సే తప్ప..మరో ఉద్దేశం నాకు లేదు. కన్నప్ప సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని మనోజ్ అన్నారు.
భైరవం విషయానికొస్తే.. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.