ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌ని అవినాష్‌?

Bigg Boss Telugu 4: Suicidal Thoughts Still Haunting Avinash - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోవైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఇద్ద‌రు కంటెస్టెంట్లు హౌస్‌లో ఎక్కువ‌కాలం ఉండ‌లేక‌పోయారు. కానీ రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ మాత్రం ఇంటిస‌భ్యుల్లో ఒక‌రిగా క‌లిసిపోయి కామెడీ, పంచుల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాడు. ఒక‌ప్పుడు క‌మెడియ‌న్‌గా వెలుగొందిన అవినాష్ లాక్‌డౌన్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఆ మ‌ధ్య త‌న క‌ష్టాల గురించి అవినాష్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాన‌ని చెప్పాడు. అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో పాటు, నాగార్జున కూడా అలాంటి మాట‌లు వ‌ద్ద‌ని, బ‌తికి సాధించాల‌ని ధైర్యం నూరిపోశారు. కానీ అరియానా మాట‌లు విన్నాక‌ అత‌ని మ‌న‌సులో నుంచి ఆత్మ‌హ‌త్య ఆలోచ‌నను తీసేయ‌లేదేమో అనిపిస్తోంది.

గుండె ఆగినంత ప‌నైంది: అవినాష్‌
నిన్నటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నాగార్జున నామినేష‌న్‌లో ఉన్న‌ ఒక్కొక్కొరిని సేఫ్ చేస్తూ వ‌చ్చారు. చివ‌రికి అవినాష్‌, మాస్ట‌ర్ మిగిలారు. తాను పక్కా సేఫ్ అవుతాన‌ని అవినాష్ కాన్ఫిడెంట్‌గానే ఉన్నాడు. ఇంత‌లో డ‌బుల్ ఎలిమినేష‌న్‌కు ఛాన్స్ ఉంటుంద‌ని నాగ్ చెప్ప‌డంతో అవినాష్‌కు ఒక్క‌సారిగా భ‌యం ప‌ట్టుకుంది. ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌ట్టాయి. శ‌రీరం వ‌ణ‌కడం ప్రారంభించింది. ఒక్క‌సారి అత‌ని మెద‌డులో త‌న జీవితం గిర్రున తిరిగింది. త‌న‌కు అన్నం పెట్టిన జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దిలేసి వ‌చ్చాడు, మ‌ళ్లీ వ‌స్తే‌ తీసుకోన‌న్నారు. కాబ‌ట్టి ఆ దారి మూసుకుపోయింది. నెక్స్ట్ ఏంటి?  శూన్యం.. మ‌ళ్లీ జీరో.. నెత్తిమీద బండెడు అప్పులు. అవ‌న్నీ ఎలా క‌ట్టాలి. భ‌విష్య‌త్తుకు భ‌రోసా ఏది?  కొన్ని క్ష‌ణాల పాటు ఈ ఆలోచ‌న‌ల సుడిగండంలో కొట్టుకుపోయాడు. ఇంత‌లో అవినాష్‌ సేఫ్ అయ్యాడు అని నాగార్జున వెల్ల‌డించిన కాసేప‌టి వ‌ర‌కు మామూలు మ‌నిషి కాలేక‌పోయాడు. గుండె ఆగినంత ప‌నైందంటూ‌ మ‌న‌సులోని బాధ‌ను క‌క్కేస్తూ గ‌ట్టిగా ఏడ్చేశాడు. (లాక్‌డౌన్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌నుకున్నా.)

జ‌బ‌ర్ద‌స్త్ షో ఒక్క‌టే జీవితం కాదు..
అయితే అత‌ని మ‌న‌సులోని బాధ‌ను అరియానా ముందే ప‌సిగ‌ట్ట‌డం విశేషం. పొర‌పాటున ఎలిమినేట్ అయితే బ‌య‌ట‌కు వెళ్లాక ఏం చేసుకోవ‌ద్దు అని ప‌దే ప‌దే వేడుకుంది. కాళ్లు ప‌ట్టుకుంటా, నా గురించి ఆలోచించు, ఎలాంటి పిచ్చి ప‌ని చేయ‌కు అంటూ క‌న్నీళ్ల‌తో వేడుకుంటూ ఒట్టేయించుకుంది. ఈ మాట‌లు విన్న ప్రేక్ష‌కులు అవినాష్ బుర్ర‌లో ఇంకా ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లే తిరుగుతున్నాయా? అని షాక్ అవుతున్నారు. అరియానా అలా ప‌దే ప‌దే బ‌తిమిలాడుతోందంటే అవినాష్ ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నాడా? అని చ‌ర్చిస్తున్నారు. అంద‌రినీ న‌వ్వించే అవినాష్ బాధ‌ల‌తో కుమిలిపోవ‌డాన్ని ఆయ‌న అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ ఒక్క‌టే జీవితం కాద‌ని, బ‌య‌ట ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని నెటిజ‌న్లు చెప్పుకొస్తున్నారు. (బిగ్‌బాస్‌: సమంత జ్యువెలరీ ఖరీదెంతో తెలుసా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top