Prabhas Birthday Special: పండగలా దిగొచ్చిన ‘డార్లింగ్‌’కు హ్యాపీ బర్త్‌డే

Bahubali actor tollywood Hero Prabhas Birthday Special - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొగల్తూరు మొనగాడు..ఆరడుగుల కటౌట్‌.. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌..రికార్డుల్లో బాహుబలి.. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో.. వీటన్నింటిని కలిపితేనే స్టార్‌ హీరో ప్రభాస్‌. దర్శకుడు ఎవరైనా, పాత్ర ఏదైనా.. డార్లింగ్‌ తరువాతే. కలెక్షన్ల సునామీనే.. ఆ కటౌట్‌ చూసి నమ్మేయ్యాలంతే.. అంతర్జాతీయంగా సినీ ప్రేమికుల హృదయాలను దోచుకున్న యూనివర్సల్ హీరో.  అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా సాహో ప్రభాస్ అంటోంది. సాక్షి. కామ్‌.

అలనాటి హీరో కృష్ణంరాజు తమ్ముడు కొడుకుగా, యంగ్‌ రెబల్‌ స్టార్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్‌ చాలా తక్కువ సమయంలోనే  తానేంటో నిరూపించు కున్నాడు. స్వశక్తితో ఎదుగుతూ తనకంటూ ఒక ట్రెండ్‌ సెట్‌ చేసుకున్నాడు. అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సొంత ఇమేజ్‌తో భారీ క్రేజ్‌ సంపాదించు కున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతూ డైరెక్టర్ల ఫ్యావరెట్‌గా మారిపోయాడు. సినిమా ఎంపికలోనూ, పాత్ర నిర్వహణలోనూ ఆచితూచి అడుగులువేస్తూ తన మార్కెట్ రేంజ్‌ను రూ.1500 కోట్లకు పెంచుకున్న బాహుబలి. అందుకే వెతుక్కుంటూ వచ్చి మరీ అనేక రికార్డులు, రివార్డులు  దాసోహ మన్నాయి.

2002లో ఈశ్వర్ సినిమాతో  తెరంగేట్రం చేసిన ప్రభాస్ అక్కడినుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోగా ఎదిగాడు. అలా బ్లాక్‌ బస్టర్‌ మూవీ వర్షం ప్రభాస్ కరియర్లో తొలి మైలురాయి అని చెప్పొచ్చు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్‌లో టైమింగ్‌, ముఖ్యంగా ఆ పవర్‌ ఫుల్‌ టోన్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరువాత అడవి రాముడు..చక్రం సినిమాలు సోసో.. అనిపించినా ఛత్రపతి మూవీతో మళ్లీ చక్రం తిప్పాడు ప్రభాస్‌. తద్వారా పవర్‌ ఫుల్‌ రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్‌ టాలీవుడ్‌కు పరిచయం కావడంమేకాదు  రికార్డుల దుమ్ము దులిపింది ఈ  మూవీ. కేవలం 8 కోట్లతో తెరకెక్కిన ఛత్రపతి 22 కోట్లు కలెక్ట్ చేసిందంటే  ఈ జోడీ  హవా అలాంటిది మరి.  

ఇక ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి, మున్నా మూవీలు ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాయి. కానీ బుజ్జిగాడు, బిల్లా మూవీలతో గట్టి కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు ప్రభాస్‌.  అలాగే బిల్లా మూవీలో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్‌లో కనిపించి..మై నేమ్‌ ఈజ్‌ బిల్లా అంటూ ఒక ఊపు ఊపేశాడు. ఇక డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి మూవీలు ప్రభాస్‌పై అంచనాలను మరింత పెంచేశాయి. పండగలా దిగి వచ్చావు అంటూ జనం నీరాజనాలు పట్టారు.  బహుశా  కట్టప్ప బాహుబలి క్రేజీ కాంబినేషన్‌కు మిర్చి మూవీనే శ్రీకారం చుట్టిందేమో.

ప్రభాస్‌ కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో, సుదీర్ఘ నిరీక్షణ తరువాత వచ్చిన బిగ్గెస్ట్‌ హిట్‌ బాహుబలి. రెండు పార్ట్‌లుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పుకునా తక్కువే. ముఖ్యంగా బాహుబలి ది బిగినింగ్‌ తరువాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది అప్పుడొక హాట్‌ టాపిక్‌. అటు టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ జక్కన్నకు, ఇటు ప్రభాస్‌కు కూడా ఇదొక ప్రతిష్టాత్మక మూవీ అంటే అతి శయోక్తి కాదు. భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలిపిన మూవీ బాహుబలి.  (Prabhas: క్లాస్‌ అయినా మాస్‌ అయినా.. మోత మోగాల్సిందే!)

కట్‌ చేస్తే ..ప్రభాస్‌ మూవీ అంటే ఆ రేంజే వేరు అన్న టాక్‌ వచ్చేసింది. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో 2019లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలైన సాహో పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ను తెలుగు ఇండస్ట్రీని పరిచయం చేసినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు స్పిరిట్ టైటిల్‌తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో మరో మూవీకి సైన్‌ చేశాడు. మరోవైపు అక్టోబ‌ర్ 23న డార్లింగ్‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీజ‌ర్లు, ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో సందడే సందడి. ఈ ప్రాజెక్టులపై ఫ్యాన్స్‌ భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి ఈ అంచనాలను ప్రభాస్‌ నిలబెట్టుకుంటాడా తన ఇమేజ్‌ నెక్ట్స్‌ రేంజ్‌కు తీసుకెళతాడా. చూడాలి మరి.(Freida Pinto: అవును..నా డ్రీమ్‌ మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నా!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top