OTT Reviews: Ardhamaindha Arun Kumar Web Series Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Ardhamaindha Arun Kumar Review In Telugu: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' రివ్యూ

Jun 30 2023 10:57 AM | Updated on Jun 30 2023 11:47 AM

Ardhamaindha Arun Kumar Review And Rating Telugu - Sakshi

టైటిల్: అర్ధమయ్యిందా అరుణ్ కుమార్
నటీనటులు: హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ తదితరులు
నిర్మాణ సంస్థ: అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్
నిర్మాత: బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్
దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్డ్స్
సంగీతం: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: అమర్ దీప్ గుత్తుల
ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి బొంతల
విడుదల తేదీ: 30 జూన్ 2023

తెలుగులో ఓటీటీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'ఆహా'నే. మిగతా వాటిల్లో తెలుగు సినిమాలు, సిరీసులు అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ దీనిలో మాత్రం ప్రతివారం ఓ సినిమా లేదంటే వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తుంటారు. వాటి రిజల్ట్ సంగతి పక్కనబెడితే ప్రేక్షకుల్ని మాత్రం అలరిస్తుంటాయి. అలా ఈసారి 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అనే వెబ్‌ సిరీస్ తీసుకొచ్చారు. హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల‍్లో నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథేంటి?
అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి)ది అమలాపురం. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలని హైదరాబాద్‌కి వస్తాడు. ఓ స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్‌గా చేరుతాడు. ఇతడి టీమ్ లీడ్ జై మాత్రం అరుణ్‌ని బానిసలా చూస్తుంటాడు. ఓ పందెం వల్ల అరుణ్.. షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్‌లోకి వచ్చిపడతాడు. కొన్నిరోజుల్లోనే ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. ఏకంగా ఆమెతో పర్సనల్ రిలేషన్‌లోకి వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో పల్లవి(అనన్య) పాత్ర ఏంటి? ఫైనల్‌గా అరుణ్ ఏం తెలుసుకున్నాడు? అనేది 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' స్టోరీ.

(ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ)

ఎలా ఉందంటే?
ఓ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు టీమ్ లీడర్ షాలినీ అందరికీ పార్టీ ఇస్తుంది. అరుణ్ కూడా ఆ పార్టీకి వస్తాడు. డ్రింక్ చేస్తాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత సెల్లార్ లోని కారులో అరుణ్-షాలినీ కాస్త అడ్వాన్స్ అవుతారు. అదే సమయంలో వీళ్లిద్దరిని మరో ఇద్దరు చూస్తారు. అసలు వీళ్లెందుకు కారులో ముద్దుముచ్చట వరకు వెళ్లారు. అరుణ్-షాలినీని చూసిన ఆ ఇద్దరూ ఎవరో తెలియాలంటే సిరీస్ చూడండి.

Ardhamaindha Arun Kumar OTT Telugu Series Review

'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్'.. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్‌కు అధికారిక రీమేక్. ఓటీటీలో ఎపిసోడ్స్ తర్వాత చాలామందికి ఇది క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నేరుగా స్టోరీలోకి వెళ్లిపోయారు. అరుణ్ కుమార్ హైదరాబాద్ లో ఓ బ్యాచిలర్ రూమ్‌లో ఉంటాడు. ఉదయమే లేచి ఆఫీస్ కి వెళ్తాడు. కానీ అక్కడేమో టీలు చేసే పని అప్పగిస్తారు. ఆ తర్వాత ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ వెళ్లారు.

కార‍్పొరేట్ వరల్డ్ లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర‍్కొన్నాడు? పని వల్ల ఎలాంటి సంఘర్షణ అనుభవించాడు? చివరకు అనుకున్నది సాధించాడా లేదా అనేది తొలి సీజన్ లోని ఐదు ఎపిసోడ్లలో చూపించారు. ఇందులో అరుణ్ కుమార్ కి ఓ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ కూడా ఉంటుందండోయ్. ఒక్కో ఎపిసోడ్ 20-25 నిమిషాలే ఉంటుంది. అలా ఆడుతూ పాడుతూ సిరీస్ ని చూసేయొచ్చు.

'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' లో చెప్పుకోవడానికి పెద్దగా కొత్తగా ఏం లేదు. అలా సాఫ్ట్ గా వెళ‍్లిపోతూ ఉంటుంది. బాగాలేదు అని చెప్పలేం అలా అని బాగుందని కూడా చెప్పలేం. ఈ సీజన్ అంతా కూడా అరుణ్ కుమార్ చుట్టూనే నడుస్తుంది. అనన్య, తేజస్వి పాత్రలని పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. బహుశా తర్వాత సీజన్లలో వీళ్లకు ప్రాధాన్యం దక్కుతుందేమో?

ఎవరెలా చేశారు?
అరుణ్ కుమార్ గా నటించిన హర్షిత్ రెడ్డి.. ఇంటర్న్ పాత్రలో సెట్ అయిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, అందరు చెప్పిన పనులు చేస్తూ బాగానే మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ బాగుంది. పల్లవిగా నటించిన అనన్య బాగానే నటించింది. ఈమె పాత్రకి ఇంకాస్త ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది. డామినేషన్, స్వార్థం కలగలిపిన టీమ్ లీడర్ షాలినీ పాత్రలో తేజస్వి  ఓకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ విషయాలకొస్తే.. స్టోరీకి తగ్గట్లు డైలాగ్స్ సింపుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. చాలావరకు ఆఫీస్ లో ఒకే చోట సీన్లన్నీ తెరకెక్కించారు. కాబట్టి పెద్దగా ఖర్చు అయ‍్యిండకపోవచ్చు. నిర్మాణ విలువులు డీసెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ పర్వాలేదనిపించాడు. సిరీస్ ని ఇంకాస్త ఎమోషనల్ గా తీసుంటే బాగుండేది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలోపే సీన్లన్నీ చకచకా పరుగెడుతుంటాయి! ఈ వీకెండ్ ఏదైనా సిరీస్ తో టైమ్‌పాస్ చేద్దామంటే 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' ట్రై చేయొచ్చు!

-చందు, సాక్షి వెబ్ డెస్క్

(ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement