రచయితగా.. నిర్మాతగా మారిన ఏఆర్‌ రెహమాన్‌

AR Rahman Turns Producer With 99 Songs - Sakshi

‘‘99 సాంగ్స్‌’ ప్రయాణంలో మ్యూజిక్‌ని నేను చూసే కోణం మారింది. కేవలం కంపోజర్‌గానే కాకుండా కథకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఆలోచించడం ప్రారంభించాను’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌  అన్నారు. ఇహాన్‌  భట్, ఎడిల్సీ జంటగా విశ్వేష్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘99 సాంగ్స్‌’. జియో స్టూడియోస్, ఏఆర్‌ రెహమాన్‌  సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రెహమాన్‌  మాట్లాడుతూ– ‘‘2001లో నేను లండన్‌  వెళ్లినప్పుడు నా స్నేహితుడు ఒకరు నీ దగ్గర కథ ఏమైనా ఉందా? అని అడిగారు. నేను మ్యూజిక్‌ కంపోజర్‌ని కదా? నా దగ్గర కథ ఎందుకు ఉంటుంది? అనుకున్నాను. ఆ తర్వాత ఆలోచిస్తే జీవితంలో చాలా కథలకు సంగీతంతో లింకు ఉంటుందనిపించింది.

27 ఏళ్లుగా సంగీతమే ప్రపంచంగా బతికాను. నా అనుభవాలను జోడించి ‘99 సాంగ్స్‌’ సినిమా కథ రాశాను. కథ రాసే ముందు స్క్రిప్ట్‌ రైటింగ్, ఫిల్మ్‌ మేకింగ్, కెమెరాకి సంబంధించిన వర్క్‌షాప్స్‌కు వెళ్లాను’’ అన్నారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘రెహమాన్‌ ప్రతి పాటా మనసుకు హత్తుకునేలా కంపోజ్‌ చేస్తాడు. ఈ సినిమాతో నిర్మాతగానూ తనకి మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘ఇందులో హీరోగా ఎంపికయ్యావని చెప్పగానే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాను’’ అన్నారు ఇహాన్‌  భట్‌. పాటల రచయితలు రాకేందు మౌళి, కళాప్రభ, మాటల రచయిత కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top