
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. హీరోయిన్ అంటే రెండు సీన్లు, మూడు పాటలే కదా అనుకుంటాం. కానీ, అనుష్క అందుకు భిన్నం. అవసరమైతే సినిమాని ఒంటిచేత్తో నడిపించగలనని నిరూపించారు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ ఆ తర్వాత జేజమ్మ, దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి పవర్‌ఫుల్ పాత్రలతో వెండితెరపై మెప్పించారు. ఒక సినిమాలో బలమైన పాత్ర ఉందంటే టక్కున గుర్తుకొచ్చే పేరు అనుష్క.. అలా మాయ చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్‌కు పరిచయం అయి నేటితో 20 ఏళ్లు. 'సూపర్' సినిమాతో 2005లో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీలో 'సాషా'గా అనుష్క నటించారు.

రావడం రావడమే అనుష్క ‘సూపర్’లో గ్లామరస్ రోల్‌తో తెలుగు పరిశ్రమకు వచ్చారు. ఆ తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తూ గ్లామరస్ రోల్స్‌లోనే కనిపించారు. అనుష్క ‘గ్లామరస్ హీరోయిన్’ అని ముద్ర పడుతున్న టైమ్‌లో, ‘అరుంధతి’గా వచ్చారు. అంతే.. గ్లామర్ స్టార్ అన్నవాళ్లే పర్ఫార్మెన్స్ స్టార్ అని కితాబులిచ్చేశారు. ‘అరుంధతి’ తరహాలోనే ‘రుద్రమదేవి, భాగమతి’ చిత్రాల్లో అనుష్క అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ‘బాహుబలి’ సినిమాలో ఆమె పోషించిన దేవసేన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న దేవసేన... 2005 సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా హోదా సంపాదించారు. సూపర్ చిత్రం తర్వాత ‘మహానంది’లో హీరో సుమంత్‌కు జోడిగా నటించింది అనుష్క. అయితే ఈ చిత్రం ద్వారా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. మాస్ మహారాజా , రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’తో అనుష్క్‌కు స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కొన్ని ప్లాపులు పడినప్పటికీ.. 2009లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’తో అనుష్క జీవితమే మారిపోయింది. ఆ సినిమాలో యువరాణి జేజమ్మగా అనుష్క అభినయానికి, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

తొలి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే..
సినిమా పరిశ్రమకు రాకముందు యోగా టీచర్‌గా ఉన్న మంగళూరు బ్యూటీ అనుష్క అనుకోకుండా నటిగా మారారు. సూపర్ సినిమా కోసం హీరోయిన్ వేటలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త నటి కావాలని చూస్తున్న సమయంలో అనుష్క గురించి ఆయనకు తెలిసింది. ఆమెను హైదరాబాద్ రప్పించి నాగార్జున సినిమాలో నటించాలని కోరారు. దీంతో ఆమె కూడా ఓకే చేశారు. అయితే ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. అయినా ఆమె మళ్లీ పలు ఛాన్సులు అందుకుని టాప్ హీరోయిన్గా ఎదిగింది. సూపర్ సినిమా అనుష్క జీవితాన్నే మార్చేసింది. నేడు ఆమె ఈ స్థాయిలో ఉండటానికి ప్రదాన కారణం దర్శకుడు పూరి జగన్నాథ్ అని చెప్పవచ్చు.