విరుష్క పెళ్లి పాట.. ‌ వీడియో రిలీజ్‌

Anushka Sharma Virat Kohli Wedding Song Full Version Released - Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాము ఎంచుకున్న రంగంలో అగ్రస్థాయికి చేరుకున్న విరుష్క.. జీవితంలో సెటిలైన తర్వాత భార్యాభర్తల బంధంలోకి అడుగుపెట్టారు. ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లి 2017లో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇటీవలే(డిసెంబరు 11) ఈ జంట మూడో వార్షికోత్సవం జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ అనుష్క చేసిన ట్వీట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ‘‘మూడేళ్ల మన బంధం.. త్వరలోనే ముగ్గురిగా మారబోతున్నాం’’ అంటూ తల్లి కాబోతున్న సంతోషాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.(చదవండి: విరుష్క బంధానికి మూడేళ్లు.. )

ఇక ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. మూడేళ్ల క్రితం అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగిన విరుష్క పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్‌ ఫుల్‌సాంగ్‌ తాజాగా విడుదలైంది. ‘పీరు వి తూ’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో పాట ప్లే అవుతుండగా.. అనుష్క ఎంట్రీ ఇవ్వగానే.. ‘‘నా భార్య.. మళ్లీ చెప్పనా నా భార్య.. ఉదయం వరకు నేనింకా చిన్నపిల్లాడినే అనుకున్నా.. ఇప్పుడే ఇంతగా ఎదిగిపోయా.. నా భార్య తను..’’ అని కోహ్లి మాట్లాడిన మాటలు, ఆ తర్వాత వారి ప్రణయ బంధాన్ని ప్రతిబింబించే దృశ్యాలతో హృద్యంగా పాట సాగి పోయిన తీరు అప్పట్లో అందరి మనసులు దోచుకుంది. కేవలం టీజర్‌లా ఉన్న ఆ పాటకు సంబంధించి పూర్తి వీడియో విడుదలైతే చూడాలని ఉందంటూ కామెంట్లు చేశారు. ఇక ఇప్పుడు వారి ఆశ నెరవేరింది. హర్ష్‌దీప్‌ కౌర్‌, మోహన్‌ కన్నన్‌ ఆలపించిన ఆ పాటను యూట్యూబ్‌లో నేడు విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top