మొదట గీతా ఆర్ట్స్, ఆ తరువాత అంజనా ప్రొడక్షన్స్, కొణెదల ప్రొడక్షన్ కంపెనీ, వి-మెగా పిక్చర్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పింక్ ఎలిఫెంట్, గీతాఆర్ట్స్-2 అంటూ మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే చాలా బ్యానర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయి. మరికొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా గీతాఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. ఇది చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థలలో ఒకటి.
అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి అదనంగా మరో బ్యానర్ వచ్చి చేరేలా ఉంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, నటుడు అల్లు శిరీశ్ ఓ కొత్త బ్యానర్‌ను స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. శిరీశ్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. దాంతో ఇప్పుడు కెరీర్ పరంగా కూడా కొత్త దశలోకి ఎంటరయ్యే ప్లాన్స్‌లో ఉన్నాడని తెలుస్తోంది.
శిరీశ్ ఇప్పటికే ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఓవైపు గీతాఆర్ట్స్, మరోవైపు గీతాఆర్ట్స్-2 వంటి నిర్మాణ సంస్థలున్నప్పటికీ శిరీశ్ ఎందుకీ దిశగా ఆలోచిస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. కాగా 38 ఏళ్ల శిరీశ్‌కు కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు.చివరగా బడ్డీ అనే సినిమాలో కనిపించాడు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. దాంతో అతడు నిర్మాతగా మారే అవకాశం ఉందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.


