
సూరజ్ బర్జాత్యా భారతీయ సినిమాను తిరిగి ఇళ్ల డ్రాయింగ్ రూమ్‌లలోకి తీసుకొచ్చిన దర్శకుడు. తల్లి దండ్రీ కొడుకు కోడలు బంధువులు అందరూ కలిసి ఉండే భారతీయ సెంటిమెంట్‌ను విపరీతంగా ఉపయోగించి సూపర్‌హిట్ లు కొట్టాడు. ‘హమ్ ఆప్‌కే హై కౌన్’, ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమాలు ఇందుకు నిదర్శనం. ఇక ప్రేమికులను ఉర్రూతలూగించిన ‘మైనే ప్యార్ కియా’ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. వివాహ బంధం మీద ‘వివాహ్’ తీసి బ్లాక్‌బస్టర్ చేశాడాయన. ఇక అతని చివరి చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ కూడా పెద్ద హిట్టే.
ఇప్పుడు సూరజ్ బర్జాత్యా కన్ను ‘స్నేహం’ మీద పడింది. అతని అన్ని సినిమాల్లో స్నేహితుల పాత్రలు కనిపించినా ఈసారి స్నేహితులే లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ ఈ సినిమాలో ఇతని స్నేహితులుగా నటించనున్నారు. వీరిద్దరి ప్రతిభ ప్రేక్షకులకు తెలుసు. పైగా గతంలో ‘వక్త్’ సినిమాలో నటించి నవ్వులు పండించారు. ఇప్పుడు సూరజ్ బర్జాత్యా సినిమాలో ఏం సందడి చేస్తారో తెలియదు.తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకుని సూరజ్ ఈ సినిమాలు తీయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది.