‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’

Alia Bhatt And Ranbir Kapoor Brutally Trolled Over Their Maldives Trip - Sakshi

అలియా, రణ్‌బీర్‌ మాల్దీవుల ట్రిప్‌పై నెటిజనుల విమర్శలు

దేశంలో కరోనా కకావికలం సృష్టిస్తోంది. సెకండ్‌ వేవ్‌ ప్రభావం భారతదేశం మీదనే అధికంగా ఉంది. ఏకంగా రోజుకు సుమారు మూడు లక్షల కొత్త కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. జనాలంతా సాధ్యమయినంత వరకు ఇంటికే పరిమితమై.. క్షేమంగా ఉండాలని ప్రభుత్వాలు విన్నవిస్తున్నాయి. కానీ సెలబ్రిటీల్లో కొందరు మాత్రం ఈ మాటలను పెడచెవిన పెడుతున్నారు. అత్యవసర పనులు ఏం లేకపోయినా సరే.. విదేశాల బాట పడుతున్నారు. ఎందుకంటే హాలీడే ఎంజాయ్‌ చేయడం కోసం అంటున్నారు. వీరిలో కొందరు ఈ మధ్య కాలంలోనే కరోనా బారిన పడి కోలుకున్న వారు కూడా ఉన్నారు. 

తాజాగా బాలీవుడ్‌ ప్రేమ పక్షులు అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లిద్దరూ కూడా హాలీడే ఎంజాయ్‌ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. విహారయాత్రకు వెళ్లడానికి కొద్ది రోజుల ముందే వీరిద్దరూ కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. ఇక నిన్న ఈ జంట ముంబై ఎయిర్‌పోర్టులో విలేకరుల కెమరాకి చిక్కింది. ఎక్కడి దాకా ప్రయాణం అని ఆరా తీయగా.. హాలీడే ఎంజాయ్‌ చేయడం కోసం మాల్దీవ్స్‌కు వెళ్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో కరోనా ఎలాంటి విలయం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోవిడ్‌ కట్టడి కోసం ముంబైలో జనతా కర్ఫ్యూ విధించినప్పటికి కూడా వీరు విదేశాలకు చెక్కేశారు. 

ఇక వీరి మాల్దీవుల ట్రిప్‌పై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ‘‘డబ్బులున్న వారికి ఏమైనా చెల్లుతుంది’’ అంటే.. మరి కొందరు మాత్రం ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’ అంటూ విమర్శిస్తున్నారు. వీరి ట్రిప్‌పై వస్తున్న విమర్శలు ఇలా ఉన్నాయి.. ‘‘దేశ ప్రజలు కోవిడ్‌ మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడుతుంటే.. మీరు మాత్రం ఎంజాయ్‌ చేయడానికి విదేశాలకు వెళ్తారా.. ఇది సబబేనా’’.. ‘‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలియా, రణ్‌బీర్‌ లాంటి వారు సామాన్యుల వల్లనే కేసులు పెరుగుతున్నాయి అంటారు’’.. ‘‘వీరు ఎంజాయ్‌ చేయడం కోసం మాల్దీవులు వెళ్తూ.. ఇంట్లోనే ఉండండి అంటూ జనాలకు ఉచిత సలహాలు ఇస్తారు’’ అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

‘‘మీరు హాలీడే కోసం ఖర్చు చేసే డబ్బు పేదల కోసం వినియోగిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి’’.. ‘‘మీ పనుల ద్వారా సామాన్యులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు’’.. ‘‘దేశంలో మహమ్మారి కోరలు చాచింది.. జనాలు చచ్చిపోతున్నారు.. కానీ ఇలాంటి జనాలకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదు’’ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. 

మరి కొందరు మాత్రం ‘‘వారి డబ్బు వారి ఇష్టం.. మనం ఇలా విమర్శించడం, ప్రశ్నించడం తగదు’’ అంటున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలకు ఇలాంటి అనుభవాలు తప్పవు. ఇక అలియా, రణ్‌బీర్‌ ఇద్దరు అయన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. ఇదేకాక అలియా గంగుబాయి కతియావాడి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్నారు. 

చదవండి: మాల్దీవులకు చెక్కేసిన బాలీవుడ్‌ ప్రేమజంటలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top