
‘‘హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేశాను. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చినా చేస్తాను. స్క్రీన్‌పై వర్ష బాగా నటిం చిందనే పేరు తెచ్చుకుంటే చాలు. ఉదాహరణకు నిత్యా మీనన్‌గారికి మంచి పెర్ఫార్మర్‌గా పేరుంది. ఆమెలా పేరు తెచ్చుకోవాలని ఉంది. ‘తమ్ముడు’ కథ విన్నప్పుడు, ఈ సినిమాలో నేను చేసిన చిత్ర క్యారెక్టర్ కొత్తగా అనిపించింది.
సవాల్‌గా తీసుకుని, ఈ సినిమా చేశాను’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. నితిన్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, బాల నటి శ్రీరామ్ దిత్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమా ‘తమ్ముడు’. కానీ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ జైకి ఓ డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటుంది చిత్ర పాత్ర.
ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయాలనుకునే మనస్తత్వం చిత్రది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇక ఓ సైకో కిల్లర్ రోల్ చేయాలన్నది నా ఆకాంక్ష. ప్రస్తుతం ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్, మరో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి’’ అని అన్నారు.