
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు. నటుల్లోనే కాకుండా నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్(Nithya Menen) ఒకరు. రీసెంట్గా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. ఆమె వయసు ఇప్పుడు 37 ఏళ్లు.. అంటే మరో మూడేళ్లలో 40ని టచ్ చేస్తారన్నమాట. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానానికి చేరుకున్న ఈ మలయాళీ భామ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతలా ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే తిరుచిట్ర ఫలం (తిరు) చిత్రంలో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.
తాజాగా విజయ్‌సేతుపతికి జంటగా నటించిన తలైవన్ తలైవి చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను మూడు నెలల వయసు నుంచే తన బామ్మ వద్ద పెరిగానని చెప్పారు. అలా చిన్న వయసులోనే ఒంటరి తనం అలవాటు అయ్యిందన్నారు. ప్రేమలో పడ్డ ప్రతిసారి అది సంతోషాన్ని కాకుండా బాధాకరమైన అనుభవాన్నే మిగిల్చిందని చెప్పారు. ప్రస్తుతం సినిమా జీవితంపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.
అలాగని జీవితంలో పెళ్లే చేసుకోననే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆత్మార్థమైన ప్రేమ లభిస్తే అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం తనకు ఈ సోలో లైఫే బెటర్‌గా ఉందని, ఈ జీవితాన్నే ఆస్వాదిస్తూ జీవిస్తున్నానని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తర్వాత ఈమె ధనుస్‌కు జంటగా నటించిన ఇడ్లీ కడై చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని గతంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంలో పెళ్లి జరిగినా.. జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదన్నారు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.