రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?

Actress Meena Preparing for second marriage - Sakshi

నటి మీనా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బాలనటిగా తెరంగేట్రం చేసిన నటీమణుల్లో ఈమె ఒకరు. ఆ తర్వాత కథానాయిక స్థాయికి ఎదిగిన మీనా 1990 దశకంలో అగ్ర కథానాయికగా రాణించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అగ్రహీరోల సరసన నటించి పాపులర్‌ అయ్యారు. ముఖ్యంగా రజనీకాంత్‌తో బాలనటిగా నటించి ఆ తర్వాత యజమాన్, ముత్తు వంటి చిత్రాల్లో కథానాయికగా నటించడం విశేషం.

అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి ప్రముఖ నటుల సరసన నటించారు. అలా నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన  విద్యాసాగర్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లాడారు. వీరికి నైనికా అనే కూతురు ఉంది. ఆ పాప కూడా తేరి తదితర చిత్రాల్లో బాలనటిగా గుర్తింపు పొందింది. కాగా వివాహానంతరం కూడా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటిస్తున్న మీనా జీవితంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

అనారోగ్యానికి గురైన ఆమె భర్త గత జూన్‌ నెలలో కన్ను మూశారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీనా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. తనకు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. ఆమె, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె తల్లిదండ్రులు మీనాకు రెండో పెళ్లి చేయడానికి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

దీంతో మీనా కూడా పెళ్లికి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వరుడు కూడా తెలిసిన వ్యక్తేనట. ఆమె భర్త మిత్రుడే అని సమాచారం. అయితే దీని గురించి మీనా తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా మీనా మలయాళంలో మోహన్‌లాల్‌ జంటగా నటించిన దృశ్యం పార్ట్‌ 1, పార్ట్‌ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో పార్ట్‌ 3 త్వరలో ప్రారంభం కాబోతుందని సమాచారం.   

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top