
ఇటీవల తమ అనుమతి లేకుండా ఫోటోలు వినియోగిస్తున్నారని బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండానే అనేక వెబ్‌సైట్‌లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న అలాంటి వాటిని తొలగించేలా ఆదేశాలిస్తామని కోర్టు వెల్లడించింది.
తాజాగా ఈ జంట మరోసారి కోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా గూగుల్, యూట్యూబ్ తమ ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ రూ.4 కోట్ల దావా వేశారు. ఏఐ సాయంతో రూపొందించిన వీడియో కంటెంట్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. లైంగికంగా అసభ్యకరమైన వీడియోలను రూపొందిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని.. ఏఐ బాలీవుడ్ ఇష్క్ అనే ఛానెల్లో దాదాపు 259 వీడియోల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
కాగా.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉన్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే ఐశ్వర్య ప్రస్తుతం ఎలాంటి సినిమాలు ప్రకటించలేదు. ఆమె చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 చిత్రంలో కనిపించింది.