
‘ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలను తెరకెక్కించిన దర్శక–నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన తాజా చిత్రం ‘అభినవ్’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ బాలల చిత్రం నవంబరు 14న విడుదల కానుంది.
ఈ చిత్రం విలేకరుల సమావేశంలో భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఓ గంజాయి మాఫియాను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ‘అభినవ్’ చిత్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియో చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాను’’ అని అన్నారు.