
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలై హిట్గా నిలిచిన సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మరో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ను అమిర్ ఖాన్ ప్రకటించలేదు.
అయితే ఇటీవల మేఘాలయలో సోనమ్ హనీమూన్ ఎపిసోడ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై అమిర్ ఖాన్ సినిమా చేయనున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అమిర్ సేకరిస్తున్నారని బీటౌన్లో వైరలవుతోంది. ఈ సినిమాపై తన సన్నిహితులతో చర్చిస్తున్నారని.. తన ప్రొడక్షన్‌లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందన్న వార్త హాట్‌టాపిక్‌గా మారింది.
అమిర్ ఖాన్ రియాక్షన్..
ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న వార్తలపై అమిర్ ఖాన్ స్పందించారు. మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై సినిమాను రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తలను అమీర్ ఖాన్ కొట్టిపారేశారు. తనపై వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇలాంటి రూమర్స్ ఎలాంటి వాస్తవ ఆధారం లేకుండానే వస్తాయని.. దీనివల్ల అభిమానులు అనవసరమైన గందరగోళానికి గురవుతారని అమిర్ ఖాన్ అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్లో తాను నటించబోనని స్పష్టం చేశారు. ఈ కథనాలు ఎక్కడ, ఎలా మొదలవుతాయే నిజంగా తనకు తెలియదన్నారు.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు
రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్‌కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు.