తెలుగుతెర సోగ్గాడు | 50 Golden Years Of Soggadu Natabushan Sobhan Babu | Sakshi
Sakshi News home page

తెలుగుతెర సోగ్గాడు

Dec 21 2025 12:38 PM | Updated on Dec 21 2025 2:23 PM

50 Golden Years Of Soggadu Natabushan Sobhan Babu

ఒక్కో హీరో కెరీర్‌లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సృష్టించిన హీరో శోభన్‌ బాబు కెరీర్‌లో అలాంటి ఓ స్పెషల్‌ సినిమా – ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్‌ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్‌బాబే అనేటంతగా స్పెషల్‌. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం 1975 డిసెంబర్‌ 19న కె. బాపయ్య దర్శకత్వంలో సురేష్‌ప్రోడక్షన్స్‌పతాకంపై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్‌ విశేషం ‘సోగ్గాడు’. రిలీజైన ‘సోగ్గాడు’ చిత్రంలోని ఉర్రూతలూపిన పాటలు, బాక్సాఫీస్‌ను ఊపేసిన వసూళ్ళు ఇవాళ్టికీ ఓ చెరిగిపోని చరిత్రే!

గ్రామీణ నేపథ్యంలోని ఓ కథ గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాలలో విజయఢంకా మోగించడం విశేషమే. ‘సోగ్గాడు’చిత్రం స్పెషాలిటీ అది. సరదాగా జీవితం గడుపుతూ, ఊరంతటితో సోగ్గాడు అనిపించుకొనే నిఖార్సయిన, నిష్కల్మషమైన వ్యక్తి – శోభనాద్రి (శోభన్‌ బాబు). అతనికి ఓ మరదలు (జయసుధ). ఆమెను పెళ్ళి చేసుకోవాల్సిన హీరో... చదువురానివాడికి ఇచ్చి పెళ్ళి చేసేది లేదన్న మామ మీద పంతంతో... చదువుకున్న అమ్మాయి కోసం పట్నం వెళతాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడ ఓ హోటల్‌ రూమ్‌లో అతను మరో అమ్మాయి (జయచిత్ర)ని పెళ్ళాడాల్సి వస్తుంది. అనుబంధాలు, ఆస్తి తగాదాలు, అయినవాళ్ళ అన్యాయాలతో ఆ ముగ్గురి మధ్య నడిచే కథ ఇది. నిజానికి, ‘సోగ్గాడు’ చూస్తుంటే సినిమా చూస్తున్నట్టనిపించదు. మన పల్లెటూళ్ళలోని నిజజీవితం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రేక్షక జనానికి అది బాగా పట్టింది.  

తెర వెనుక మరో రచయిత..
ఓ పక్కా తమిళ రచయిత ఇచ్చిన సాదాసీదా కథను తీసుకొని, దాన్ని పక్కా తెలుగు వాతావరణంలో, మన పల్లెటూళ్ళు, అక్కడి పరిస్థితులు ప్రతిబింబించేలా తెరకెక్కించడం ఆషామాషీ కాదు. అది చేసి చూపించి, సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది ‘సోగ్గాడు’. అప్పటికే తరచూ తనను కలుస్తూ, అనుబంధం పెంచుకున్న రచయిత మోదుకూరి జాన్సన్‌కు సంభాషణల బాధ్యత అప్పగించారు నిర్మాత రామానాయుడు. అయితే, ఈ సినిమాకు తెరపై పేరు కనబడని మరో కీలక రచయిత అప్పలాచార్య. ‘‘తమిళ సినీ కథా, సంభాషణల రచయిత బాలమురుగన్‌ ఇచ్చిన ఈ జిలేబీ కథ (నవ్వుతూ...)కు నేను, రచయిత అప్పలాచార్య కలసి పక్కా మన తెలుగుదనం వచ్చేలా, కామెడీ కలగలిసేలా ట్రీట్‌మెంట్‌ చేశాం. కథలో భాగంగా బాలమురుగన్‌ రాసిన తమిళ కీ డైలాగులు కూడా వాడుకున్నాం. జాన్సన్‌ మంచి డైలాగులు రాశారు. వాటికి అప్పలాచార్య మరింత మెరుగులు దిద్ది, వన్నె తెచ్చారు. కథకు తగ్గట్టు హీరో సహా వివిధ పాత్రల డైలాగులకు పల్లెటూరి భాష, ఆ యాస వాడాం’’ అని దర్శకుడు కె. బాపయ్య ‘సాక్షి’కి వివరించారు.

అచ్చ తెలుగుదనానికై... అంతా ఔట్‌డోర్‌లో...:
వ్యవసాయాధారమైన అప్పటి తెలుగు పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించడం కోసం ‘సోగ్గాడు’ను అత్యధికంగా ఔట్‌డోర్‌లో తీశారు. ‘‘వ్యవసాయదారులు తాము తీసుకెళ్ళిన టిఫిన్‌ క్యారేజీలను చెట్ల కొమ్మలకు కట్టుకొని, చేలల్లో పనికి దిగడం లాంటివి చేసేవారు. పల్లెటూళ్ళలో షూటింగ్‌తో నేను చిన్నప్పుడు చూసిన ఆ వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చా. అందుకే చిత్రీకరణకై యూనిట్‌ ఆరేడుసార్లు ఆంధ్రాకు వెళ్ళాం’’ అని బాపయ్య చెప్పారు. 1975 ఏప్రిల్‌ 26న మద్రాసులోని వాహినీ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్‌ మొదలైంది. ఆ తర్వాత బాపయ్య సహా ఎందరో సినీ ప్రముఖులకు స్వస్థలమైన విజయవాడ సమీపంలోని కోలవెన్నులో పెద్ద షెడ్యూల్‌ ΄్లాన్‌ చేశారు. రెండు రోజులు చిత్రీకరణ జరిగిందో లేదో... భారీ వర్షాలు రావడంతో షూటింగ్‌ రద్దయింది. అయితే, తర్వాత మళ్ళీ ఆ ఏడాది సెప్టెంబర్‌ మూడో వారంలో మళ్ళీ కోలవెన్ను వెళ్ళారు. గ్రామస్థుల విశేష సహకారం మధ్య అక్కడ ఓ వారం రోజుల పాటు ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 80 మందితో ‘సోగ్గాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము దులుపుతాడు...’ పాట షూటింగ్‌ చేశారు. 

అలాగే, కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో చెడుగుడు (కబడ్డీ) పోటీల దృశ్యాలను చిత్రీకరణ జరిపారు. మరికొన్ని అవుట్‌డోర్‌ దృశ్యాలను ఎలమలో తీశారు. గోదావరి జిల్లాల్లో మండపేట, అలాగే నది నేపథ్యం కోసం గోదావరి నది పక్కన ఉండే సఖినేటిపల్లికి వెళ్ళి అక్కడ చిత్రీకరణ జరిపారు. నిర్మాత రామానాయుడు తన స్వస్థలమైన కారంచేడులో తొలిసారిగా షూటింగ్‌ చేసిన చిత్రమూ ఇదే. అలా ఆ ఏడాది జూలై మొదటివారం కారంచేడు కళాకారులకు నివాసమై, వేలాది జనాన్ని ఆకర్షించింది. (తరువాత మళ్ళీ హిందీ రీమేక్‌ ‘దిల్‌దార్‌’లో జితేంద్ర – రేఖలతో ‘సోగ్గాడు లేచాడు...’ పాట హిందీ వెర్షన్‌ను కోలవెన్నులోనూ, ‘బెన్‌హర్‌’ తరహాలో ఎడ్లబండ్ల ఛేజ్‌ లాంటివి కారంచేడులోనూ చిత్రీకరించడం విశేషం). ఇక, సోగ్గాడు నగరానికి రావడం, తిరగడం లాంటి దృశ్యాలను హైదరాబాద్‌ అబిడ్స్‌లో తీశారు. 

మళ్ళీ సురేష్‌ప్రోడక్షన్స్‌పై...
1964లో ‘రాముడు – భీముడు’తో ‘సురేష్‌ప్రోడక్షన్స్‌’ మొదలైనా, మధ్యలో సురేష్‌ మూవీస్, నిర్మాత నాగిరెడ్డి గారి పిల్లలను కలుపుకొని ‘విజయా – సురేష్‌ కంబైన్స్‌’ లాంటి వివిధ బ్యానర్ల పేర్లతో సినిమాలు తీశారు నిర్మాత రామానాయుడు. మళ్ళీ ‘సోగ్గాడు’ నుంచి మాత్రం మొదట స్థాపించిన ‘సురేష్‌ప్రోడక్షన్స్‌’ పేరుతోనే చిత్రనిర్మాణం పునః్రపారంభించారు. నిజానికి ఈ చిత్రాన్ని నాగిరెడ్డి వారసుల ‘విజయా కంబైన్స్ రామానాయుడి ‘సురేశ్‌’ సంస్థ సంయుక్తంగా ‘విజయా అండ్‌ సురేష్‌ కంబైన్స్‌’ పేరిట సమర్పించినట్టు టైటిల్స్‌లో ఉంటుంది. పోస్టర్లు, పబ్లిసిటీలో మాత్రం ‘విజయా కంబైన్స్ ’ పేరు కనిపించదు. ఏమైనా, సురేశ్‌ సంస్థ, నిర్మాత రామానాయుడుల స్థాయి ‘సోగ్గాడు’ కమర్షియల్‌ హిట్‌తో మరింత పెరిగింది. 

 ఆ వినాయకుడి విగ్రహం   షాటే ఇప్పటికీ...
మరో విశేషం ఏమిటంటే, ‘సోగ్గాడు’ కోసం కోలవెన్ను గ్రామం నడిబొడ్డున మండపాల కూడలిలో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు అక్కడే స్థానికుల సహకారంతో వరసిద్ధి వినాయకుడి విగ్రహాన్ని రామానాయుడు ప్రతిష్ఠించారు. అక్కడ వినాయకుడికి ఆయన నమస్కరిస్తుండగా షాట్‌ తీశారు. అప్పట్నించి ‘సురేష్‌ప్రోడక్షన్స్‌’ తాము నిర్మించిన సినిమాల న్నింటికీ టైటిల్స్‌ ముందు ఆ వినాయకుడి పూజా దృశ్యాన్నే తెరపై చూపడం ఓ సెంటిమెంట్‌.కోరమీసం, ముఖం మీదకు పడే వంకీల జుట్టు, పంచెకట్టుతో, ఎడ్లబండి నడుపుతూ తెరపై కనిపించారు శోభన్‌బాబు. ఆ గెటప్‌కు ఆయనకు ప్రేరణ నిజజీవితంలోని తన బాబాయి. ‘సోగ్గాడు’ పాత్రధారణ కోసం నిజజీవితంలోని ఆ బాబాయి వేషభాషలనే అనుకరించినట్టు శోభన్‌ స్వయంగా చెప్పారు. ‘తస్సాదియ్యా’ అనే ఊతపదంతో అలరించారు. 

తెలుగులో ఆమెకు తొలి ఛాన్స్‌... 
జయసుధ, జయచిత్రల గ్లామర్‌ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. కథలో పల్లెటూరి వాతావరణం, బావా మరదళ్ళ సరసం లాంటివన్నీ ఉన్నాయి గనక తెరపై లంగా, ఓణీతో తెలుగుదనం కనిపించేలా యువ హీరోయిన్స్‌ అయితే బాగుంటుందని దర్శక, నిర్మాతలు భావించారు. అందుకే, అప్పటికే టాప్‌ రేంజ్‌లో ఉన్న సీనియర్‌ హీరోయిన్లను సైతం పక్కనపెట్టి జయచిత్ర, జయసుధలను ఎంచుకున్నారు. తమిళంలో అప్పటికే కథానాయికగా నటిస్తున్న తెలుగమ్మాయి జయచిత్ర మెయిన్‌ హీరోయిన్‌. ‘సోగ్గాడు’తోనే తెలుగుతెరకు నాయికగా ఆమె పరిచయమయ్యారు. అంతకు ముందు చిన్నవయసులో ఆమె తెలుగులో నటించారు. ‘‘తమిళంలో నేను హీరోయిన్‌గా పరిచయమైన ‘΄÷న్నుక్కు తంగ మనసు’ చిత్ర కథారచయితే బాలమురుగన్‌ గారే ‘సోగ్గాడు’కూ రచయిత కావడం మర్చిపోలేను’’ అని జయచిత్ర చెప్పారు. ‘‘సినిమా అంటే తెలియని చిన్నవయసు నుంచే జయచిత్ర, నేను మంచి ఫ్రెండ్స్‌. తమిళంలో బాలచందర్‌ ‘సొల్లత్తాన్‌ నినైక్కిరేన్‌’ (1973 – తెలుగులో ‘అమ్మాయిలూ జాగ్రత్త’గా రీమేకైంది), శివాజీగణేశన్‌ ‘భారత విలాస్‌’ (1973) సహా అయిదారు సినిమాలు కలసి కూడా పని చేశాం. జయచిత్రది ఓ ప్రత్యేక స్టైల్‌. ఆమెలా చిలిపి, అల్లరి పాత్రలు పోషించే శైలి వేరెవరికీ రాలేదు’’ అన్నారు జయసుధ. 

ఫలించిన శోభన్‌ జోస్యం... 
ఇక, అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ ఏమో హీరో మరదలిగా ‘సోగ్గాడు’లో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర పోషించారు. సురేష్‌ సంస్థలోనూ జయచిత్ర, జయసుధలకు అదే తొలి సినిమా. తరువాతి కాలంలో గ్లామర్‌ తారలుగా ఎదగడానికి ‘సోగ్గాడు’ ఘనవిజయం వాళ్ళిద్దరి కెరీర్‌కూ పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ‘సోగ్గాడు’ షూటింగ్‌ జరుగుతుండగానే జోడీగా చేస్తున్న నటి జయసుధ భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారని ఓ జర్నలిస్టు, హీరో శోభన్‌బాబును ప్రశ్నించారు. ‘మరో రెండేళ్ళలో జయసుధ ్రపామినెంట్‌ స్టార్‌ అవుతుం’దని శోభన్‌ జోస్యం చెప్పారు. కట్‌ చేస్తే అక్షరాలా అదే జరిగింది. ఆ వెంటనే క్రాంతికుమార్‌ నిర్మించిన ‘జ్యోతి’(1976) తో ఆమె నటిగా తానేమిటో నిరూపించారు. ఎన్టీఆర్‌ ‘అడవిరాముడు’ (1977)తో గ్లామర్‌ హీరోయిన్‌ అయ్యారు. ఇటు అందం, అటు అభినయంతో అనతికాలంలోనే జయసుధ స్టార్‌ హోదాను అందుకున్నారు. ఏయన్నార్‌ నుంచి చిరంజీవి దాకా నాటి అగ్రహీరోలందరితో నాయికగా రాణించారు. 

∙స్టార్‌డమ్‌ తెచ్చిన సూపర్‌ హిట్‌...
శోభన్‌బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రంలో కె.వి. మహదేవన్‌ సంగీతంలో ఆత్రేయ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘సోగ్గాడు’ రిలీజవడానికి సరిగ్గా వారం ముందు... 1975 డిసెంబర్‌ 12న ఇదే చిత్ర దర్శకుడు కె. బాపయ్య డైరెక్ష¯Œ లోనే పెద్ద ఎన్టీఆర్‌ నటించిన ‘ఎదురులేని మనిషి’ వచ్చింది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్‌కు అదే తొలి సినిమా. ఎన్టీఆర్‌ను ఓ కొత్త పంథాలో చూపిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే, సీనియర్‌ హీరోతో పోటాపోటీగా శోభన్‌ను నిలిపింది ‘సోగ్గాడు’. అలాగే, బాక్సాఫీస్‌ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. 

అంతకు ముందే వచ్చిన ‘జీవనజ్యోతి’ (1975 మే 16) సమయానికే శోభన్‌బాబు హీరోగా వరుస విజయాలతో తారాపథానికి ఎదిగారు. ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడు నెలలకు వచ్చిన ‘సోగ్గాడు’ కూడా 32 కేంద్రాల్లోనే రిలీజై, 31 కేంద్రాల్లో 50 రోజులు జరుపుకోవడం విశేషం. అయితే, ‘సోగ్గాడు’ 16 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, 3 కేంద్రాల్లో షిఫ్టులతో కలిపి మొత్తం 19 సెంటర్లలో వంద రోజులాడినా, రజతోత్సవ ఘనత దక్కలేదు. శోభన్‌ కెరీర్‌లో అత్యధిక కేంద్రాల శతదినోత్సవ చిత్రం ఇదే. సరికొత్త స్టార్‌ హీరోగా శోభన్‌బాబు అవతరించడానికి  ‘సోగ్గాడు’ తోడ్పడింది. విజయవాడ మునిసిపల్‌ స్టేడియమ్‌ గ్రౌండ్స్‌లో 1976 ఏప్రిల్‌11న శతదినోత్సవం జరిపారు. 
 
∙బాక్సాఫీస్‌ హిట్‌తో... బాపయ్య బిజీ బిజీ
ఈ చిత్రం బాపయ్యను కూడా దర్శకుడిగా మరో మెట్టు పైన పెట్టింది. దర్శకుడు తాపీ చాణక్య దగ్గర అసిస్టెంట్‌గా వర్క్‌ చేసిన బాపయ్యకు సురేష్‌ప్రోడక్షన్స్‌ ఆవిర్భావం, తొలి చిత్రం ‘రాముడు– భీము డు’(1964) నుంచి ఆ సంస్థతో అనుబంధం ఉంది. ‘‘రామానాయుడు గారు ఆ కంపెనీ రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌ పేపర్లు కావాలంటే, వెళ్ళి, కొని తెచ్చింది నేనే. ఆ సంస్థకు 60 ఏళ్ళు దాటడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాపయ్య. ఆయన దర్శకుడిగా పరిచయమైందీ సురేష్‌ప్రోడక్షన్స్‌ ‘ద్రోహి’తోనే. అది ఫెయిలైందని అందరూ వారించినా, రామానాయుడు మాత్రం బాపయ్య ప్రతిభపై నమ్మకం ఉంచి ‘సోగ్గాడు’ ఛాన్సిచ్చారు. ఆ అవకాశాన్ని బాపయ్య సద్వినియోగం చేసుకొని, కమర్షియల్‌ డైరెక్టర్‌గా నిరూపించుకున్నారు. 

దాదాపు సమాంతరంగా షూటింగులు జరిగి, వారం రోజుల తేడాలో రిలీజైన ఎన్టీఆర్‌ ‘ఎదురులేని మనిషి’, శోభన్‌బాబు ‘సోగ్గాడు’ రెంటినీ హిట్‌ చేసి, బాక్సాఫీస్‌ వద్ద డైరెక్టర్‌గా తన సత్తా చాటుకున్నారు బాపయ్య. తరువాత చిరంజీవితో ‘సంఘర్షణ’, ‘కొదమ సింహం’ లాంటి చిత్రాలు చేసిన ప్రముఖ దర్శకుడు కె. మురళీమోహనరావు అటు ‘ఎదురులేని మనిషి’కి కొద్దిరోజులు, ఇటు ‘సోగ్గాడు’కు పూర్తిగా బాపయ్య వద్ద దర్శకత్వ శాఖలో పనిచేయడం విశేషం. ఈ తెలుగు హిట్‌ను తర్వాత హిందీలో జితేంద్ర, రేఖ జంటగా ‘దిల్‌దార్‌’ (1977 ఏప్రిల్‌ 13) పేరిట రామానాయుడే నిర్మించారు. తమిళంలో మాత్రం శివకుమార్‌ (హీరో సూర్య తండ్రి) – శ్రీవిద్య జంటగా వేరే దర్శక, నిర్మాతలు ‘రాధై కేట్ర కణ్ణన్‌’ (1978) పేరిట రీమేక్‌ చేశారు. తెలుగుహిట్‌ బాణీలనే తమిళంలోనూ వాడారు. హిందీ రీమేక్‌ ‘దిల్‌దార్‌’ తెలుగు వెర్షన్‌ తీసిన బాపయ్య  దర్శకత్వంలోనే వచ్చింది. దర్శకుడిగా బాపయ్యకు అదే తొలి పూర్తిస్థాయి హిందీ చిత్రం. అక్కడ నుంచి ఆయన ఇటు నేరు తెలుగు చిత్రాలు, అటు మన తెలుగువాళ్ళు తీస్తున్న హిందీ రీమేక్స్‌తో ఇరవయ్యేళ్ళు బిజీ బిజీగా గడిపారు.   

ఎక్కడ విన్నా ఆ పాటలే!
ఆ రోజుల్లో తెలుగునాట ఎక్కడ విన్నా... మహదేవన్‌ బాణీల్లోని ‘సోగ్గాడు’ పాటలే. ‘‘బహుశా ‘అవ్వా బువ్వా కావాలంటే...’ పాటో, మరో పాటో గుర్తు లేదు కానీ, ‘ఎదురులేని మనిషి’కై ఆత్రేయ రాసిన ఓ పాట అందులో ఒదగదనిపించి, విలేజ్‌ నేపథ్యంలోని ‘సోగ్గాడు’కు వాడాం’’ అని బాపయ్య గుర్తు చేసుకున్నారు. ‘సోగ్గాడు’ కోసం శోభన్‌బాబు డ్యాన్స్‌ మాస్టర్‌ బి. హీరాలాల్‌ వద్ద శిక్షణ ΄÷ంది, పాటలకు స్టెప్పులేశారు. ‘సోగ్గాడు లేచాడు...’ పాట వస్తూ ఉంటే, మాస్‌లో ఓ హిస్టీరియా. ఫ్యా¯Œ ్స అయితే, తమ అభిమాన హీరో బాక్సాఫీస్‌ వద్ద జూలు విదిలించి, రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు. ఈ సినిమాలోని ‘ఏడుకొండలవాడా వెంకటేశా...’ పాట రేడియోలో కొన్నేళ్ళు ఓ అభిమాన జనరంజక గీతం. ‘సోగ్గాడు’ అంతా పూర్తయ్యాక ఫస్ట్‌కట్‌ చూసుకున్నాక మరో ప్రణయ గీతం ఉంటే బాగుంటుందనిపించి, శోభన్‌– జయసుధలపై ‘చలివేస్తోంది చంపేస్తోంది’ పాట ఎ.వి.ఎం. స్టూడియోలో తీసి, కలిపారు. ఆ పాట కుర్రకారుకు కిర్రెక్కించింది.

 హ్యాట్రిక్‌ ‘ఫిల్మ్‌ఫేర్‌’ల... ఏకైక తెలుగు హీరో! 
చాలామందికి తెలియనిదేమిటంటే, శోభన్‌ కెరీర్‌లో అతి పెద్ద కమర్షియల్‌ హిట్‌ అని అందరూ అనుకొనే ‘సోగ్గాడు’ కన్నా ‘జీవనజ్యోతి’దే వసూళ్ళలో పైచేయి. ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. టికెట్‌ రేట్లు ఎక్కువుండే ఏసీ, డీలక్స్‌ థియేటర్లలో ‘సోగ్గాడు’ రిలీజైన కాకినాడ, నెల్లూరు టౌన్లను మినహాయిస్తే, మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ వసూళ్ళు వచ్చింది – ‘జీవనజ్యోతి’కే! అయితే, ఆ రెండు చిత్రాలూ ఆయనను ఉత్తమ నటుడిగా నిలిపి, అవార్డు సాధించిపెట్టాయి. ‘ఖైదీ బాబాయ్‌’ (1974), ‘జీవనజ్యోతి’ (1975) తరువాత వరుసగా మూడో ఏడాది ఈ ‘సోగ్గాడు’ (1976)తో ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు ఆయనకే దక్కింది. తెలుగులో అలా వరుసగా మూడేళ్ళు ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్‌ అందుకున్న ఏకైక హీరో శోభనే!

అది... నటభూషణ నామ సంవత్సరం!
శోభన్‌బాబు కెరీర్‌లో శిఖరాయమాన సంవత్సరమంటే 1975! ఆ ఏడాది శోభన్‌ సినిమాలు 8 రిలీజైతే అందులో 5 (‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘జీవనజ్యోతి’, ‘బలిపీఠం’, ‘జేబుదొంగ’, ‘సోగ్గాడు’) హిట్లు . రెండే (‘గుణవంతుడు’, ‘అందరూ మంచివారే’) ఫ్లాపులు. ఒకటి (‘బాబు’) యావరేజ్‌. అయిదు హిట్లలోనూ ‘జీవనజ్యోతి’ 25 వారాలాడి, సిల్వర్‌జూబ్లీ చేసుకుంది. ఏయన్నార్‌కి పర్మినెంట్‌ నిర్మాతైన రామానాయుడు తీసిన ‘సోగ్గాడు’ రజతోత్సవానికి ఒక వారం ముందే థియేటర్ల నుంచి తొలగించబడింది. అలా ఉద్దేశ పూర్వకంగా హాళ్ళలో తీసేయడం పట్ల ఎన్నో ఊహాగానాలు వినవచ్చాయి. అప్పట్లో అది టాపిక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ. ఏమైనా అలా ఒకే ఏడాది అధికశాతం కమర్షియల్‌ సక్సెస్‌లతో శోభన్‌ క్రేజు పెరిగిపోయింది. పరిశ్రమలో ఆయన రేంజే మారిపోయింది. ఎవరు ఆపదలచినా... ఆగని రీతిలో ఆయన ప్రస్థానం సాగిపోయింది తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే అందాల హీరోగా తెలుగుతెరను ఏలారు. అదీ ‘సోగ్గాడు’ చేసిన మ్యాజిక్‌.

ఆయన అప్పుడే చెప్పారు!
‘‘మద్రాసులోని ఓ స్టూడియోలో షాట్‌ గ్యాప్‌లో నేను ఫ్లోర్‌ బయట కూర్చొనివుంటే, వేరే షూటింగ్‌ కోసం మేకప్‌ రూమ్‌ నుంచి వెళుతున్న శోభన్‌బాబు ‘మీరే కదా జయసుధ’ అంటూ నా దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆయన మంచి సక్సెస్‌లో ఉన్న పేరున్న హీరో. ఆయన నాలో ఏం గమనించారో కానీ, ‘యాక్టర్‌ సత్యనారాయణ గారు మీ ప్రతిభ గురించి చెప్పారు. మీరు పెద్ద ఆర్టిస్ట్‌ అవుతారు’ అని అప్పుడే అంచనా వేసేశారు. ‘సోగ్గాడు’కు చాలా ముందెప్పుడో... అలా మా ఇద్దరి తొలి పరిచయం. కట్‌ చేస్తే  ఆ తర్వాత ‘సోగ్గాడు’ లో తొలిసారి ఆయన పక్కనే నటించాను. అంతకు ముందు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ లాంటి స్టార్ల చిత్రాల్లో పాత్రలు పోషించినా, ఒక అగ్ర హీరో సరసన హీరోయిన్‌గా నేను నటించడం ‘సోగ్గాడు’లోనే! ఆ సినిమా సెన్సేషనల్‌ హిట్‌తో హీరోయిన్‌గా నాకు పెద్ద బ్రేక్‌ వచ్చింది. అంతే... ఆ తర్వాత మా కాంబినేషన్‌లో ఎన్నో పెద్ద పెద్ద హిట్లు. కాలగతిలో శోభన్‌బాబు గారితో అత్యధికంగా 38 చిత్రాల్లో నటించిన హీరోయినయ్యాను. తెరపై సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌గానే కాక ప్రేక్షకులకు అమితమైన అభిమానం ΄÷ందిన వెండితెర జంట మాది!’’
– హీరోయిన్‌ జయసుధ

అక్కినేనికి ‘దేవదాసు’... శోభన్‌కు ‘సోగ్గాడు’
‘‘మా చిన్నప్పటి ‘సోగ్గాడు’ చిత్ర నిర్మాణం నాకు గుర్తే. మద్రాసులో బీచ్‌లో పడవల దగ్గర కూర్చొని, రచయిత మోదుకూరి జాన్సన్‌ డైలాగ్స్‌ రాయడం లాంటి దృశ్యాలు ఇప్పటికీ జ్ఞాపకమే. మా నాన్న గారి (డి. రామానాయుడు) ద్వారా ఆ సక్సెస్‌ గురించి ఎన్నో సంగతులు విన్నా. హిందీలోనూ ఆ చిత్రాన్ని జితేంద్ర – రేఖలతో ‘దిల్‌దార్‌’ పేరుతో రీమేక్‌ చేస్తే, అక్కడ కూడా మంచి సక్సెసే! ఏయన్నార్‌ గారికి ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’ లాంటివి ఎలాగో, శోభన్‌బాబు గారికి ‘సోగ్గాడు’ అలా! ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆ సినిమాను మా సంస్థ నిర్మించడం మాకు గర్వకారణం.’’ 
– సురేష్‌ డక్షన్స్‌ సారథి డి. సురేశ్‌బాబు

ఛార్టర్డ్‌ ఫ్లైట్‌లో పంపారు!
‘‘ఎన్టీఆర్‌ గారి సరసన హీరోయిన్‌గా మా అమ్మ జయశ్రీ నటించిన ‘దైవబలం’ చిత్రంలో శోభన్‌బాబు చిన్న పాత్ర పోషించారు. నేను అదే శోభన్‌బాబు పక్కన ‘సోగ్గాడు’తో తొలిసారి తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయ్యా. అప్పటికే ఆయన పెద్ద హీరో. నేను కొత్త. అయినా, మొదటిరోజు వాహినీ స్టూడియోలో ‘ఏడుకొండలవాడా...’ పాటతో షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి ఆయన నన్నెంతో ్రపోత్సహిస్తూ నటింపజేశారు. ‘సోగ్గాడు’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడే నాకు తమ్ముడు పుట్టాడు. పెద్ద సాంగ్‌ షూటింగ్‌ మధ్యలో ఉండగా అప్పటికప్పుడు వెళ్ళడానికి నిర్మాత రామానాయుడు గారు ‘హిందూ’ పత్రిక వారి స్పెషల్‌ ఛార్టర్డ్‌ విమానంలో పంపిన సంగతి మర్చిపోలేను. అలాగే, ‘సోగ్గాడు’ చిత్రాన్ని తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆ బృందంలో రామానాయుడు గారు నన్ను తీసుకువెళ్ళారు. అదే నా తొలి విదేశీ పర్యటన. అక్కడ ఇండియన్‌ డ్యాన్సులు చేయాలంటే, రాజ్‌కపూర్‌ తదితరుల ఎదుట పాటలకు నేను డ్యాన్స్‌ చేశా. అదో మరపురాని అనుభూతి.’’  – హీరోయిన్‌ జయచిత్ర  

విజయవాడలో వేలాది జనం... అదే ట్రైన్‌లో ఎన్టీఆర్‌...
‘‘శోభన్‌బాబుతో నా కాంబినేషన్‌లో ‘సోగ్గాడు’ నుంచి కృష్ణ – శోభన్‌బాబు మల్టీస్టారర్లు ‘ముందడుగు’, ‘మండేగుండెలు’ దాకా ఎన్నో హిట్స్‌ వచ్చాయి. తొలి రోజుల్లో నామమాత్రపు ΄ారితోషికాలకు చిన్న వేషాలు వేస్తున్నప్పటి నుంచి శోభన్‌బాబు నాకు తెలుసు. అలాంటివాడు పట్టుదల, క్రమశిక్షణ, ముందుజాగ్రత్తలతో ‘రిచెస్ట్‌ తెలుగు హీరో ఇన్‌ మద్రాస్‌’ అయ్యాడు. మంచి మనిషి, మహా అందగాడు. ఫైట్లు – యాక్షన్‌ కన్నా, ప్రేమ సీన్లు, ఫ్యామిలీ సీన్లు, అభినయం – డైలాగ్స్‌ ఎక్కువుండే వాటిని ఆయన ప్రిఫర్‌ చేసేవారు. ఆ రోజుల్లో ‘సోగ్గాడు’ శతదినోత్సవం విజయవాడలో చేస్తే, వేలల్లో జనం వచ్చారు. వేడుక అద్భుతంగా జరిగాక, మళ్ళీ అదే రోజు అర్ధరాత్రి దాటాక ఉన్న ట్రెయిన్‌ పట్టుకొని యూనిట్‌ అంతా మద్రాసుకు తిరుగు పయనమయ్యాం. అనుకోకుండా అదే రైలులో మా వెనకాల సీట్లలోనే అగ్ర హీరో ఎన్టీఆర్‌ ఉన్నారు. అది తెలిసి, వెళ్ళి 
పలకరించాం. ఆయన ఆత్మీయంగా అందరినీ అభినందించారు.’’    – దర్శకుడు కె.బాపయ్య  
– రెంటాల జయదేవ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement