బాబోయ్‌.. ఎంత పెద్ద పాము | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. ఎంత పెద్ద పాము

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని మిర్జాపల్లిలో పొడవైన తాడిజెర్రి పాము కలకలం రేపింది. బుధవారం గ్రామంలోని ఎస్సీ కాలనికి చెందిన బాబు ఇంట్లోకి చొరబడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. పామును గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. అదే గ్రామానికి చెందిన పెద్దులు అనే వ్యక్తి ముందుకొని పాము పట్టుకొని చంపేశాడు. దానిని చూసిన స్థానికులు బాబాయ్‌.. ఎంత పెద్ద పాయో అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు.

డంపింగ్‌ యార్డును

తరలించండి

నర్సాపూర్‌ రూరల్‌: డంపింగ్‌ యార్డును తరలించాలని కోరుతూ నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు చైతన్యపురి కాలనీ, పెద్దచింతకుంట పంచాయతీ పరిధిలోని పాప్యా తండావాసులు బుధవారం ఆర్డీఓ, మున్సిపల్‌ కమిషనర్‌, ఎఫ్‌ఆర్‌ఓలకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సాపూర్‌ గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న డంపింగ్‌ యార్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, ఈగలు దోమల బెడదతో అనారోగ్యం బారిన పడుతున్నట్లు చెప్పారు. పంట పొలాలు సైతం దెబ్బతింటున్నాయని వాపోయారు. వెంటనే డంపింగ్‌ యార్డ్‌ను దూర ప్రాంతానికి తరలించాలని కోరారు.

పోలీసుల సంక్షేమం కోసమే పెట్రోల్‌ బంక్‌

చిన్నశంకరంపేట(మెదక్‌): పోలీస్‌ పెట్రోల్‌ బంక్‌ ద్వారా నాణ్యతతో పాటు ప్రామాణికమైన పెట్రోల్‌, డీజిల్‌ అందించనున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. బుధవారం మండలంలోని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు, పోలీస్‌ సంక్షేమం కోసమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోల్‌ బంక్‌ ద్వారా వచ్చిన ఆదాయం పోలీస్‌ వెల్ఫేర్‌ కోసం వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రజలు నాణ్యతను దృష్టిలో పెట్టుకొని పోలీస్‌ పెట్రోల్‌ బంక్‌ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రశేఖర్‌, అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌, ఇండియన్‌ ఆయిల్‌ స్టేట్‌ మేనేజర్‌ అరుణ్‌, డీఎస్పీలు నరేందర్‌గౌడ్‌, రంగనాయక్‌, సీఐలు సైదానాయక్‌, రంగకృష్ణ, ఎస్‌ఐలు శివానందం, నారాయణ, చైతన్యరెడ్డి, బుక్యానాయక్‌ పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

నర్సాపూర్‌ రూరల్‌: టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించే ‘ఓటు బచావో– దేశ్‌ బచావో’ సంవిధాన్‌ ర్యాలీకి పార్టీలకతీతంగా పెద్దఎత్తున తరలిరావాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లు తొలగించబడ్డాయన్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాలీ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement