దొడ్డు బియ్యం మాయం! | - | Sakshi
Sakshi News home page

దొడ్డు బియ్యం మాయం!

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

● కొన్ని చోట్ల ఎలుకలు.. పురుగులపాలు ● జిల్లాలో 756 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ● 5 లాట్లుగా వేలం.. త్వరలో సేకరణ

● కొన్ని చోట్ల ఎలుకలు.. పురుగులపాలు ● జిల్లాలో 756 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ● 5 లాట్లుగా వేలం.. త్వరలో సేకరణ

పాపన్నపేట(మెదక్‌): రేషన్‌ షాపుల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం కొందరు డీలర్లు అమ్ముకోగా, మరికొన్ని చోట్ల ఎలుకలు.. పురుగుల పాలవుతున్నాయి. సన్న బియ్యం సరఫరా ప్రారంభం అయ్యాక, మిగిలిపోయిన బియ్యం కోసం ఏడాదిన్నర తర్వాత వేలం పాటలు నిర్వహించారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నిల్వ ఉన్న బియ్యాన్ని ఇప్పటికే టెండర్‌దారులు తీసు కోగా, డీలర్ల వద్ద ఉన్న 756 మెట్రిక్‌ టన్నుల బియ్యం రెండు, మూడు రోజుల్లో తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

గత మార్చి నుంచి సన్న బియ్యం

రేషన్‌ షాపుల్లో గతేడాది మార్చి వరకు దొడ్డు బియ్యం సరఫరా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. జిల్లాలో 520 రేషన్‌ షాపులుండగా, 2,41,832 రేషన్‌ కార్డుదారులున్నారు. ఇందులో అంత్యోదయ 13,881, ఆహారభద్రత 2,27,886, అన్నపూర్ణ 65 కార్డులుండగా, నెలకు 50.03 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా 7,90,304 మంది లబ్ధిపొందుతున్నారు. అయి తే గత మార్చి నాటికి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో రేషన్‌ డీలర్ల వద్ద పెద్ద మొత్తంలో దొడ్డు బియ్యం నిల్వ ఉండేవి.

అమ్ముకున్న డీలర్లు!

రేషన్‌ షాపుల్లో సుమారు 20 నెలలుగా దొడ్డు బియ్యం నిల్వ ఉండటంతో కొంత మంది డీలర్లు వాటిని అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. రైస్‌ మిల్లర్లు గతంలో సీఎంఆర్‌ కింద తీసుకున్న ధాన్యం అమ్మేసి, బియ్యం బకాయిపడ్డారు. ఈ మధ్యలో డిఫాల్టర్‌ మిల్లులపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు జరుగుతుండటంతో రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి పెట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే మరికొంత మంది డీలర్ల వద్ద బియ్యం స్టాక్‌లు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఇందులో కొంతమేర ఎలుకలు, పురుగుల తినేయడంతో కొంతవరకు ఆ సాకు చెప్పి తప్పిచుకోవచ్చనే ధీమా డీలర్లలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. తప్పకపోతే టెండర్‌దారుతో మాట్లాడి, అతడు టెండర్‌ పాడిన ధరను చెల్లించవచ్చనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.

సెప్టెంబర్‌లో వేలం పాట

జిల్లాలోని 520 రేషన్‌ షాపులను 5 లాట్‌లుగా విభజించి సెప్టెంబర్‌లో వేలం పాటలు నిర్వహించారు. మొత్తం 756.185 మెట్రిక్‌ టన్నుల బియ్యానికి వేలం పాటలు నిర్వహించగా, రఘురామ ట్రేడర్స్‌ హుజూరాబాద్‌ కాంట్రాక్టర్‌ చేగుంట, నర్సాపూర్‌, శంకరంపేట, పాపన్నపేట లాట్‌లను క్వింటాల్‌కు రూ.21,856 టెండర్‌ కోడ్‌ చేసి కై వసం చేసుకున్నట్లు తెలిసింది. కాగా, మరో టెండర్‌దారు రాజమల్లేశ్వర రైస్‌, ఫ్లోర్‌మిల్‌ నందిగామ (ఏపీ) వారు మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌ లాట్‌లను అదే ధర నిర్ణయించి టెండర్‌ కైవసం చేసుకున్నారు. రెండు మూడు రోజుల్లో వారు డీలర్ల వద్ద నుంచి దొడ్డు బియ్యం తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సివిల్‌ సప్లై అధికారులు తెలిపారు. ఈ విషయమై పాపన్నపేట తహసీల్దార్‌ సతీశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. తాను వెళ్లిన రేషన్‌ షాపుల్లో దొడ్డు బియ్యం స్టాక్‌ ఉన్నట్లు గమనించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement