అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్
మెదక్‌జోన్: జీవితాలను చిత్తు చేసే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, క్రమశిక్షణ, లక్ష్య సాధనపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. మత్తు రహిత సమాజ నిర్మాణంలో నేటి విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా నష్టపోతాయని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోవాలని వివరించారు. చెడు స్నేహాలకు, హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అంతకుముందు మత్తు పదార్థాలకు దూ రంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ మహేశ్, హెచ్ ఎం మల్లేశం, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


