మూడు నెలల పాటు కొనసాగనున్న ప్రక్రియ ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 వేల పైచిలుకు బాధితులు
అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి తమ సొమ్ము తిరిగి వస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తున్న బాధితులకు ఎట్టకేలకు ఊరట కలిగించే చర్యలు ప్రారంభమయ్యాయి. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బాధితుల డిపాజిట్ బాండ్లు, నగదు రశీదుల పరిశీలన ప్రక్రియ షురూ అయింది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా
14 వేల పైచిలుకు మంది సంస్థలో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఉన్నారు.
– మెదక్‌జోన్
కూతురు పెళ్లికి డబ్బులు ఉపయోగపడతాయని కొందరు.. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ప్రతీ నెల వచ్చిన జీతాన్ని మరికొందరు.. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో రిటైర్మెంట్ సొమ్మును ఉద్యోగులు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసి మోసపోయారు. ఈక్రమంలో బాధితుల డిపాజిట్ బాండ్లు, నగదు రశీదుల పరిశీలనకు సీఐడీ షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని బాధితుల కోసం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. బాధితుల వద్ద ఉన్న బాండ్లు, చీటీ రూపంలో చెల్లించిన రశీదులతో పాటు ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నారు. సంస్థకు ఎవరు ఎంత చెల్లించారు..? డిపాజిట్ చేసిన బాండ్ల కాలపరిమితి ఎప్పటి వరకు పూర్తయింది. డిపాజిట్‌దారుడు చనిపోతే అతడి నామినీ వివరాలను మండలాల వారీగా సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏపీ, తెలంగాణకు చెందిన సీఐడీ అధికారులు శ్రీనివాస్, సైదిరెడ్డి పాల్గొన్నారు. సుమారు రెండు దశాబ్ధాల డిపాజిటర్ల నిరీక్షణకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో డిపాజిటర్లు సంస్థలో ఎంత పెట్టుబడులు పెట్టారనేది మాత్రం పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే తెలియనున్నట్లు సమాచారం.
అసలు ఇస్తారా.. వడ్డీతోనా..?
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2007, 2009 సంవత్సరాల్లో అగ్రిగోల్డ్ సంస్థలో ఎక్కువగా డిపాజిట్ చేసినట్లు బాధితులు తెచ్చిన బాండ్లను పరిశీలిస్తే తెలుస్తోంది. డిపాజిట్ చేసినప్పటి నుంచి ఆరేళ్ల కాల పరిమితితో రెండింతల డబ్బులు ఇవ్వనున్నట్లు ఆ బాండ్లపై పొందుపరిచారు. ఈ లెక్కన కాలపరిమితి గడిచి దశాబ్ద కాలం అవుతుంది. ఈ నేపథ్యంలో బాధితులకు పెట్టిన డబ్బులే తిరిగి ఇస్తారా..? లేక వడ్డీతో కలిపి ఇస్తారా..? అనేది మాత్రం తేలాల్సి ఉంది. కాగా, ఆ సంస్థ ఆస్తులెన్ని, ఈడీ అటాచ్ చేసింది ఎంత..? డిపాజిట్లు అన్ని లెక్కలు కట్టిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు పంపకాలు జరుగుతాయని, అప్పటి వరకు ఏం చెప్పలేమంటూ సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు.
డిపాజిట్ బాండ్ల వివరాలు సేకరిస్తున్న పోలీస్‌శాఖ


