కలెక్టర్ ప్రతిమాసింగ్
హవేళిఘణాపూర్(మెదక్): ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం సర్ధన చెక్‌డ్యాంను పరిశీలించి మాట్లాడారు. గతంలో ఈ పంపింగ్ ద్వారా జక్కన్నపేటకు సరఫరా చేసి అక్కడి నుంచి 33 గ్రామాలకు సరఫరా చేసేందుకు వీలుంటుందన్నారు. సింగూ రు నుంచి నీటి సరఫరా బంద్ అయిన తర్వాత నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయంగా చెక్‌డ్యాం ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు చెప్పారు. సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.42 కోట్లు మంజూరు చేసిందన్నారు. 3.5 కిలోమీటర్ల మేర సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతీరోజు ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున తాగునీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రజలు నీటిని వృథా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వినోద, ఆయా శాఖల మండల అధికారులు, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
»»


