పేదలకు సొంత గూడు | - | Sakshi
Sakshi News home page

పేదలకు సొంత గూడు

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

జిల్లాలో ముమ్మరంగా ఇళ్ల నిర్మాణాలు గోడల వరకు పూర్తయిన వాటికి రూ. 2 లక్షలు మంజూరు రెండు విడతల్లో 10 వేలకు పైగా మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

పేదల గూడు గోడును తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జిల్లాలో చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో కలిపి 11 వేలకు పైగా ఇళ్లను మంజూరు చేసింది. పూరి గుడిసె ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతనిస్తోంది. గతంలో గోడల వరకు నిర్మించుకొని రేకులు వేసిన ఇళ్లకు సైతం స్లాబ్‌ కోసం రూ.2 లక్షలు మంజూరు చేస్తుంది.

దీంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

– మెదక్‌జోన్‌

జిల్లాలో మొదటి విడతలో 9 వేల మంది నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి విడతల వారీగా రూ. 5 లక్షలను అందజేస్తుంది. వీటితో 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకునే నిబంధన ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చే నిధులకు మరికొన్ని జమ చేసి లబ్ధిదారులు ఇళ్లు కట్టుకుంటున్నారు. రెండో విడతలో మాత్రం పూరి గుడిసెలో నివసిస్తున్న 1,984 మందిని అధికారులు ఎంపిక చేశారు. మొత్తంగా జిల్లాలో 10,984 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 5,200 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌ వరకు పూర్తి కాగా, మరో 6 వందల పైచిలుకు గోడల వరకు, 890 బేసెమెంట్‌ లెవల్‌, మరో 1,500 ఇళ్లకు మార్కింగ్‌ ఇచ్చారు. ఇటీవల మంజూరైన ఇళ్లు కలుపుకొని ఇంకా 2,794 నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది.

పూరి గుడిసెలకు ప్రాధాన్యం

ఇటీవల రెండో విడతలో భాగంగా జిల్లాలో పూరి గుడిసెల్లో ఉన్న పేదలకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 1,984 మందిని గుర్తించి ఇళ్లు మంజూరు చేశారు. పూరి గుడిసెలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాన్ని అందించారు. ఇటీవల 600 మంది ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు.

సగం గోడలకూ బిల్లులు

ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు గతంలో గోడల వరకు ఇంటిని నిర్మించుకొని వాటిపై రేకులు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారికి సైతం ఇందిరమ్మ పథకంలో రూ. 2 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. దీంతో సదరు లబ్ధిదారుడు రేకులను తొలగించి గోడలపై స్లాబ్‌ వేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 317 మందిని గుర్తించామని, వారు ముందుకు వస్తే ఆ ఇంటిని పరిశీలించి రూ. 2 లక్షలు మంజూరి చేసి స్లాబ్‌ వేసుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది చక్కటి అవకాశం

ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారుడికి ప్రభు త్వం రూ. 5 లక్షలు ఇస్తోంది. ఇది చక్కటి అవకాశంగా భావించాలి. రెండో విడత లో పూరి గుడిసెలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చాం. అదే విధంగా గతంలో గోడలు నిర్మించి రేకులు వేసుకున్న వారికి సైతం రూ. 2 లక్షలు అందజేస్తాం. దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.

– మాణిక్యం, హౌసింగ్‌ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement