● తొలిసారిగా పంపిణీ ● జిల్లాలో 44 పాఠశాలలు ● 18,913 మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే టైలు, బెల్ట్‌లు, షూస్ అందించిన ప్రభుత్వం, తాజాగా స్టూడెంట్ డైరీల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో కనిపించే డైరీలు ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల్లో కనిపిస్తున్నాయి. – న్యాల్‌కల్(జహీరాబాద్)
జిల్లాలో 812 ప్రాథమిక, 187 ప్రాథమికోన్నత, 218 ఉన్నత, 17 కేజీబీవీలు, 10 ఆదర్శ పాఠశాలలతో పాటు గురుకులాలతో కలిపి మొత్తం 1,249 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1,11,160 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 44 పాఠశాలలు పీఎంశ్రీ పథకానికి ఎంపికయ్యాయి. వాటిలో 25 జెడ్పీహెచ్‌ఎస్‌లు, 4 మోడల్ స్కూల్స్, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక కేజీబీవీతో పాటు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలున్నాయి. వాటిలో 18,913 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారందరికీ డైరీలను అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. కాగా, పీఎంశ్రీ పాఠశాలలకు వచ్చిన స్టూడెంట్ డైరీలను ఆయా పాఠశాలలకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 శాతం మేర విద్యార్థులకు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన విద్యార్థులకు డైరీలు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.
సమగ్ర సమాచారం
పీఎంశ్రీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొట్టమొదటి సారిగా పంపిణీ చేస్తున్న స్టూడెంట్ డైరీల్లో విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని అధికారులు పొందుపర్చారు. విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల పేరు, పరీక్షలు, సెలవులు, పని దినాలు తదితర వివరాలతో పాటు విద్యార్థి వ్యక్తిగత వివరాలను కూడా డైరీలో నమోదు చేసుకునేందుకు ఆధార్, స్టూడెంట్ యూఐడీ నంబర్, పుట్టిన తేదీ, రూల్ నంబర్ అవకాశం కల్పించారు. పాఠశాల ప్రారంభం నుంచి ముగిసే వరకు పని దినాలు, సెలవులు తదితరాలను ప్రతి రోజు విద్యార్థులు డైరీలో రాయాలి. వాటికి ఉపాధ్యాయులు పరిశీలించి సంతకాలు చేయాలి. అంతేకాకుండా వాటిని తల్లిదండ్రులు పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు డైరీలో వీలు కల్పించారు.
50 శాతం పంపిణీ
జిల్లాలో 44 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 18,913 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ స్టూడెంట్ డైరీలను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు 50 శాతం మేర పాఠశాలలకు పంపిణీ చేశాం. డైరీల వల్ల విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగనుంది.
– రోహిణి, డీఈఓ


