కలెక్టర్ ప్రతిమాసింగ్
అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన
మెదక్ కలెక్టరేట్: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు (సీబీటీ) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. పరీక్ష ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో ఆయాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని నర్సాపూర్ బీవీఆర్‌ఐటీలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–2) పోస్టులకు సంబంధించి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 200 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతకుముందు పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్‌సీ చైర్మన్ వెంకటేశం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ యూనస్, నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


