కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని రైతులను యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉందన్నారు. పంటల మార్పిడిపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన విత్తనాలు, పెట్టుబడి, మార్కెటింగ్ సదుపాయాలను రైతులకు ముందుగానే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో వర్షపాతం లోటు, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భజలాల లభ్యతను పరిగణనలోకి తీసుకొని పంటల సాగు ప్రణాళికను రూపొందించాలన్నారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న గ్రామాల్లో వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, ఇతర ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. నకిలీ, నాణ్యతలేని, లేబుళ్లు లేని విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు సంబంధిత శాఖలతో కలిసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


