తూప్రాన్: మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ కేవలం ప్రచారానికే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో చెత్త సమస్యను పట్టించుకునేవారే కరువయ్యారని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. బుట్టల పంపిణీ సరే.. మరి రోడ్లపై కుప్పలుగా పేరుకుపోయిన ఈ చెత్త సంగతేంటని మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా గోల్డెన్ పార్క్ నుంచి అల్లాపూర్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా భారీగా చెత్తను పారబోయడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే సివిల్ సప్లై గోడౌన్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రి (సీహెచ్‌సీ) వరకు రోడ్డుకు ఇరువైపులా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి చెత్తను గుమ్మరిస్తున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, బాటసారులు అవస్థలు పడుతున్నారు.
వార్డుల్లో అధ్వానం.. రోగాల భయం
పట్టణంలోని 6, 12వ వార్డుల్లో పారిశుద్ధ్య పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వీధుల్లో చెత్త సకాలంలో తీయకపోవడంతో దోమలు, ఈ గలు విపరీతంగా పెరిగిపోయి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య లోపంపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు సంప్రదించగా స్పందించలేదు.
రహదారుల వెంట చెత్త కుప్పలు
వ్యాపిస్తున్న దుర్గంధం
మున్సిపల్ అధికారులపై ప్రజలు ఆగ్రహం


