ఎల్‌నినోతో భయం లేదు
● అన్నదాతకు అదనపు ఆదాయం
● స్వల్ప వ్యవధిలో పంట చేతికి..
● జిల్లాలో 5 వేల ఎకరాల్లో సాగు
మెదక్ కలెక్టరేట్: వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక పద్ధతులు అవలంభించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఆందోళనలో ఉన్న రైతులకు ఆయిల్‌పాం సాగు వరంగా మారింది. అందులో ఆరుతడి పంటలతో అధిక లాభాలకు అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం 5 వేలకు పైగా రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. పంట సాగు చేసిన 4 ఏళ్ల తర్వాత ఏటా ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి ఇబ్బందులు పడుతున్న రైతులు ఆయిల్‌పాం సాగువైపు దృష్టి మరుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
అధిక సబ్సిడీలు
ఆయిల్‌పాం పంట ఒక్కసారి సాగు చేస్తే చాలు 40 ఏళ్లు లాభాలు కురిపిస్తుంది. పంట వేసిన మొదటి మూడేళ్లలో ఫలసాయం ఉండదు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక మొత్తంలో సబ్సిడీలు అందజేస్తుంది. మొక్కలతో పాటు డ్రిప్ ఇరిగేషన్, ఇ తర పరికరాలు అందిస్తుంది. అలాగే సాగు చేసిన 4 ఏళ్లపాటు నెలకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులకు అందిస్తున్నాయి.
ఖాళీ స్థలంలో వివిధ పంటలు
అయిల్‌పాం మొక్కలను త్రిభుజాకారపు పద్ధతిలో 9 మీటర్ల దూరంతో నాటుతారు. తోటలోని ఖాళీ స్థలంలో మొదటి మూడేళ్ల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు. కూరగాయ, పూల, మొక్కజొన్న మిరప, పత్తి, పొట్టి అరటి, పొగాకు, పశుగ్రాసాలు లాంటి పంటలను అంతర పంటలుగా పండించుకోవచ్చు. వీటి ద్వారా ఎకరాకు రూ. 10 వేల నుంచి రూ.30 వేల వరకు నికర ఆదాయం పొందవచ్చు. అంతర పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.
ప్రస్తుతం జిల్లాలోని చాలా మంది రైతులు వర్షాధారమైన వరి పంటలు సాగు చేశారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో పొట్టదశలో ఉన్న వరి పంటకు తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడుతుంది. వేసవిని తలపిస్తున్న ఎండలతో రైతులంతా ఒకేసారి పంటలకు నీరేందుకు బోర్లపై ఆధారపడుతున్నారు. దీంతో విద్యుత్ సమస్య ఏర్పడుతుంది. ఆయిల్‌పాం సాగుకు డ్రిప్ ద్వారా సాగు నీరందించండం వల్ల ఎలాంటి సాగునీటి సమస్య ఉండదు.


