చిన్నశంకరంపేట(మెదక్): విద్యుత్ కోతలకు నిరసనగా సోమవారం బీజేపీ అధ్వర్యంలో మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి శవయాత్రకు ఏర్పాట్లు చేయగా, పోలీస్‌లు భగ్నం చేశారు. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో నాయకులు మెదక్– చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం, తూప్రాన్ సీఐ వెంకటరాజంగౌడ్ బీజేపీ నాయకులను సముదాయిస్తున్న సమయంలోనే మరికొందరు నాయకులు జంగరాయి క్రాస్‌రోడ్డు వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మరికొందరు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రైతులను పట్టించుకోకుండా సీఎం, ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఎం వచ్చిందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లారెడ్డి, సురేష్‌గౌడ్, నరేందర్‌రెడ్డి, దశరథం తదితరులు పాల్గొన్నారు.


