పాపన్నపేట(మెదక్): కార్యాలయ సమయ వేళలు ముగియగానే సాధారణంగా ఉద్యోగులు ఇళ్లకు వెళ్తారు. కానీ పాపన్నపేట రెవెన్యూ అధికారులు మాత్రం గురువారం రాత్రి 12.30 గంటలకు ఒక్క ఫోన్ కాల్తో స్పందించారు. కారు చీకట్లో కాలి నడకన మంజీఱా నదికి వెళ్లి ఇసుక మాఫియా భరతం పట్టారు. అక్రమంగా ఇసుక తోడేస్తున్న వ్యాపారుల చర్యలను అడ్డుకున్నారు. పాపన్నపేట మండలం చిత్రియాల్ శివారులోని మంజీరా నదిలో కొన్ని రోజులుగా వ్యాపారులు ట్రాక్టర్లపై అక్రమంగా ఇసుక తోడేస్తున్నారు. ఇదే విషయాన్ని అర్ధరాత్రి కొంత మంది రైతులు రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆర్ఐ శరత్, జీపిఓ సాయిలు, సిబ్బంది కృష్ణ, శివ హుటాహుటిన సంఘటనా స్థలికి వెళ్లి, ఇసుక రవాణను అడ్డుకున్నారు. వాహనాల్లో ఇసుక తరలించకుండా జేసీబీతో కాలువ తవ్వి మార్గం మూసివేశారు. ఈ చర్యను రైతులు హర్షించారు.


