కరెంట్ కోత.. రైతు వెత
నర్సాపూర్‌లో ఎండుతున్న వరి
ఎల్‌నినో ప్రభావంతో వాన ముఖం చాటేసింది. చెరువుల్లో నీళ్లు ఇంకిపోయాయి. పచ్చని పొలాలు నెర్రెలు వారుతున్నాయి. ఆకాశం వైపు చూసి చూసి అన్నదాత కళ్లు కాయలు కాస్తున్నాయి. బోర్లను నమ్ముకుంటే అప్రకటిత విద్యుత్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. నీరు ఉన్నప్పటికీ పొలాలకు అందకపోవడంతో ఎండుముఖం పడుతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు అనేక పాట్లు పడుతున్నారు. – నర్సాపూర్
జిల్లావ్యాప్తంగా విద్యుత్ కోతలతో మోటార్లు సరిగా నడవక సుమారు నలభై శాతం పంటలు ఎండుముఖం పట్టాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేజ్ కరెంటు సరఫరా చేయాల్సి ఉన్నా, మధ్యలో 2 నుంచి 3 గంటల పాటు కరెంట్ కోత పెడుతున్నారు. సాగుకు 10 గంటలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో 6 నుంచి 7 గంటలే వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో పంటలను కాపాడుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. ఆర్థిక భారమైన జనరేటర్లు, డీజిల్ ఇంజన్లు ఏర్పాటు చేసుకొని పొలాలకు నీరు పెడుతున్నారు. దీంతో రోజుకు వెయ్యి రూపాయల వరకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోగా మిగిలిన పంటను కాపాడుకోవాలన్న ఆశతో భారమైనా భరిస్తున్నామని రైతులు వాపోతున్నారు.
కాలుతున్న మోటార్లు.. ట్రాన్స్‌ఫార్మర్లు
వ్యవసాయానికి తక్కువ సమయం కరెంట్ సరఫరా చేయడంతో పాటు లోఓల్టేజీగా వ్యవసాయ బోరు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని రిపేరు చేయించేందుకు రూ. రెండు వేల వరకు ఖర్చ చేస్తున్నారు. ప్రస్తుతం వరి పైరు గింజ గట్టిపడే సమయం కావడంతో నీరు ఎక్కువ అవసరం, ఈ సమయంలో మోటార్లు కాలిపోవడం, కరెంటు ఉండకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టు మిట్టాడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయం వచ్చినందున నాణ్యమైన కరెంటు సరఫరా చేయా లని వేడుకుంటున్నారు.
నాలుగెకరాలు ఎండిపోయింది
ట్రాక్టర్‌కు డీజిల్ ఇంజన్ బిగించి దాని నుంచి కరెంటును బోరు మోటారుకు సరఫరా చేస్తూ వరి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. డీజిల్‌కు రోజుకు రూ. 600 వరకు ఖర్చవుతుంది. తమకు అదనపు భారం అయినప్పటికీ పంటను కాపాడుకోవాలని భరిస్తున్నాం. ఇప్పటికే నాలుగు ఎకరాలు ఎండిపోయింది. మిగిలిన పంటను కాపాడుకోవడానికి పాల్లు పడుతున్నా.
– శ్రీపాల్, రైతు, నర్సాపూర్
సరిపడా నీరందక ఎండుతున్న పొలాలు
తీవ్ర వర్షాభావంతో నిండని నీటి వనరులు
పంటలను కాపాడుకునేందుకు తప్పని పాట్లు


