సబ్‌ గలీజ్‌ దందా | - | Sakshi
Sakshi News home page

సబ్‌ గలీజ్‌ దందా

Oct 8 2026 6:59 AM | Updated on Oct 8 2026 6:59 AM

మెదక్‌ బల్దియాలో ‘మడిగెల’ అక్రమాలు

● తక్కువ లీజుకు తీసుకొని మూడింతల అద్దెకు

● మున్సిపాలిటీకి రూ. లక్షల్లో నష్టం

● చోద్యం చూస్తున్న పాలకులు, అధికారులు

మెదక్‌ బల్దియాలో మడిగెల దందా జోరుగా సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో గల దుకాణాలను కొందరు పాలకవర్గ నేతలు అండదండలతో దశాబ్దాల క్రితం అతి తక్కువ ధరకు అద్దెకు తీసుకున్నారు. అంతకు మూడింతల అద్దె పెంచి సబ్‌ లీజుకు ఇస్తున్నారు. ఫలితంగా మున్సిపల్‌ ఆదాయానికి నెలనెలా లక్షలాది రూపాయల గండిపడుతోంది. ఇదంతా అధికారుల కనుసన్నల్లో జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. – మెదక్‌జోన్‌

మున్సిపాలిటీ ఏడు దశాబ్దాల క్రితం ఏర్పాటైంది. దీని పరిధిలో మార్కెట్‌ రోడ్డు, పాతబస్టాండ్‌, పటేల్‌కుంట పరిధిలో 163 షాపులు (మడిగెలు) ఉన్నాయి. వీటికి ఏడాదికి రూ. 66 లక్షల అద్దె వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో చాలా వరకు ఒక్కోదానికి రూ. 3 నుంచి రూ. 4 వేల వరకు మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. కానీ వాటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు ఇతరులకు (సబ్‌) లీజ్‌కు రూ.10 వేలకు పైగా అద్దెకు ఇస్తున్నారు. అంటే మూడు రెట్లు అధికంగా వసూలు చేసుకుంటున్నారు. దీంతో మున్సిపాలిటీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. చాలా ఏళ్లుగా ఈ దందా సాగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సిండికేట్‌గా మారి

బల్దియాలో దశాబ్దాలుగా ఈ దందా సాగుతుండగా, రెండేళ్ల క్రితం పాతబస్టాండ్‌ సమీపంలో 16 షాపులను ఖాళీ చేయించి ఓపెన్‌ టెండర్‌ నిర్వహించారు. ఇందులో నామమాత్రంగా డిపాజిట్‌ పెట్టగా, కొందరు వ్యక్తులు డిపాజిట్‌ చేసి ఓపెన్‌ టెండర్‌లో పాల్గొన్నారు. ఇందులో ఒక్కో షాపును రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. వేలంలో షాపులను కై వసం చేసుకున్న వారు అద్దెకు రాలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే అద్దె ఎక్కువగా పాడామని అందుకే రాలేకపోతున్నట్లు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత రెండోసారి మళ్లీ టెండర్‌ నిర్వహిస్తే మొదటి సారి రూ. 50 వేలకు వేలం వేసిన షాపులను సిండికేట్‌గా ఏర్పడి రూ. 15 వేల నుంచి రూ. 20 వేలకు మాత్రమే వేలం పాడారు. చేసేది లేక అధికారులు వారికి కట్టబెట్టారు. కాగా, ఒక్క పాతబస్టాండ్‌ వద్ద మాత్రమే పాతవారిని ఖాళీ చేయించి ఓపెన్‌ టెండర్‌ పెట్టిన అధికారులు, మార్కెట్‌ ఏరియాతో పాటు పటేల్‌కుంటలోనూ సబ్‌లీజుకు ఇచ్చిన షాపులను స్వాధీనం చేసుకుంటే మున్సిపాలిటికి రూ. లక్షల ఆదాయం సమకూరుతుందని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు.

ఖాళీ చేయాలని నోటీసులు

పట్టణంలోని పటేల్‌కుంటలో మున్సిపాలిటీకి సంబంధించిన 67 షాపులను కొన్ని దశాబ్దాల క్రితం అద్దెకు ఇచ్చారు. అద్దెకు తీసుకున్న వారి గడువు సైతం ముగిసినట్లు తెలిసింది. కాగా, అవి నిర్మించి ఐదు దశాబ్దాలు గడిచిపోయింది. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరడంతో వాటిని డిస్మెంటల్‌ చేసి వాటి స్థానంలో నూతనంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి ఇస్తామని అధికారులు చెప్పారు. అయినా వారు ఖాళీ చేయటం లేదని చెబుతున్నారు. కాంప్లెక్స్‌ నిర్మాణానికి నిధులు మంజూరైన తర్వాతే ఖాళీ చేస్తామని తేల్చి చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement