నర్సాపూర్ రూరల్: వన్యప్రాణులు సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా నర్సాపూర్ అడవితో పాటు అర్బన్ పార్కును బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సందర్శించారు. అటవీశాఖ అధికారులు విద్యార్థులకు ఔషధ మొక్కలు, వన్య ప్రాణులు, వాటి ఆవాసాలు, సంరక్షణ చర్యల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎఫ్ ఆర్‌ఓ దివ్య మాట్లాడుతూ.. మానవాళి మనుగడతో విడదీయరాని సంబంధం కలిగిన అటవీ, వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు. వృక్షాల నరికివేత, జంతువుల వేటను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ, జంతు సంపదను కాపాడడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం అటవీ ప్రాంతంలోని వాచ్ టవర్ వద్ద విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేశ్‌కుమార్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


