రామాయంపేట(మెదక్): తన నిధులతో మూడు నెలల క్రితం ప్రభుత్వ ఆస్పత్రికి మంజూరు చేయించిన డెంటల్ చైర్‌ను వినియోగంలోకి తీసుకొచ్చే విషయమై ఎందుకు తాత్సారం చేశారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆస్పత్రిలో డెంటల్ విభాగాన్ని పరిశీలించి మాట్లాడారు. మూడు నెలలుగా ప్రజలకు ఎందుకు సేవలు అందించలేదని జిల్లా ఆస్పత్రుల కోఆర్డినేటర్ శివదయాల్, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ లింబాద్రిని ప్రశ్నించారు. ఆస్పత్రికి డెంటర్ చైర్ మంజూరైన విషయమై తనకు సమాచారం ఇవ్వకపోవడంలో అంతర్యమేమిటని మండిపడ్డారు. ఆస్పత్రిలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేద రోగులకు మనం న్యాయం చేయకపోతే వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని ఎంపీ హెచ్చరించారు. అనంతరం వైద్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
వైద్యులపై ఎంపీ రఘునందన్ ఆగ్రహం


