పాడి రైతులకు మంచి రోజులు రానున్నాయి. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా జిల్లాలో అతిపెద్ద పాల పరిశ్రమ ‘అమూల్’ ఏర్పాటు కానుంది. దీనికి ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 3.90 లక్షలకు పైగా రైతులు ఉండగా, పాడి పశువులు 1.52 లక్షలు ఉన్నాయి. వాటిలో నల్లజాతి (గేదెలు) 1.3 లక్షలు ఉండగా, తెల్లజాతి (ఆవులు) 49 వేలు ఉన్నాయి. అయితే పాడి రైతులకు ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉంది. వ్యవసాయ అనుబంధ రంగమైన పశు పోషణపై రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో నిత్యం 5 లక్షల లీటర్ల చిల్లింగ్ కెపాసిటీతో అమూల్ పాల పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థకు 20 వేల మంది రైతులు పాలు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో దీనిని రూ.400 కోట్ల పెట్టుబడితో ప్రారంభించి ఐదేళ్లలో రూ. 2 వేల కోట్లకు విస్తరించే విధంగా అమూల్ సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు 250 మంది కాగా, 2 వేలకు పైగా తాత్కాలిక సిబ్బంది పనిచేయనున్నారు. స్థానికులకే 90 శాతం ఉద్యో గాలు లభించనున్నట్లు సమాచారం.
సబ్సిడీపై పాడి గేదెలు, ఆవులు
వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అమూల్ కంపెనీని బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగనుంది. సంస్థకు వచ్చే లాభాల్లో 83 శాతం రైతులకు, 17 శాతం లాభాలను కంపెనీ నిర్వహణకు, అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇందులో రోజుకు 5 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేసి ప్యాకింగ్ చేసే సామర్థ్యంతో కంపెనీ నిర్మించనున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో సబ్సిడీపై పాడి గేదెలు, ఆవులతో పాటూ దాణా అందించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దేశీయ ఆవులు, గేదెలు, ముర్రాజాతి పశు పోషణకు అధికంగా ప్రాధాన్యం ఇవ్వ నున్నారు. పాలకు మద్దతు ధర ఇవ్వటంతో పాటు రైతులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదిగే విధంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిసింది.
రూ.400 కోట్లతో భారీ ప్రాజెక్టుకు ‘అమూల్’ శ్రీకారం
నిత్యం 5 లక్షల లీటర్ల చిల్లింగ్
కెపాసిటీ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు
రేపు కేంద్ర మంత్రి అమిత్‌షా చేతుల మీదుగా భూమిపూజ
లాభాల్లో 83 శాతం రైతులకు వాటా
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు
మొదటిసారి పాల పరిశ్రమ
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు, గుమ్మడిదల, సిద్దిపేట, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, శివ్వంపేట, నర్సాపూర్‌తో పాటు పలు మండలాల్లో వేలాది పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో స్థానికులకు కొంత ఉపాధి అవకాశాలు లభించినప్పటికీ వాటి నుంచి వెలువడే రసాయనాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో బ్రాహ్మణపల్లిలో మొదటిసారిగా పాడి రైతుల కోసం అమూల్ పరిశ్రమ ఏర్పాటు కానుండటంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు మేలు జరుగనుంది.


