దాహార్తి తీరేలా.. | - | Sakshi
Sakshi News home page

దాహార్తి తీరేలా..

Oct 3 2026 7:24 AM | Updated on Oct 3 2026 7:24 AM

మూలనపడ్డ తాగునీటి పథకాలకు కొత్తరూపు ఇస్తారా?

పాపన్నపేట(మెదక్‌): మూలనపడిన తాగు నీటి పథకాలకు కొత్తరూపు నిస్తే.. తరుముకొస్తున్న తాగు నీటి గండం గట్టెక్కే అవకాశం కనిపిస్తుంది. మరో రెండు నెలల్లో మూత బడుతుందనుకుంటున్న మిషన్‌ భగీరథకు ప్రత్యామ్నాయంగా వృథాగా ఉన్న పథకాలకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాపన్నపేట మండలంలో కొంత మేర దాహం తీరే అవకాశముందని భావిస్తున్నారు. మంజీరా నదిలో నిర్మించిన పొడిచన్‌పల్లి, కొత్తపల్లి, కుర్తివాడలో తాగు నీటి పథకాలను వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

30 ఏళ్ల క్రితం పంప్‌హౌస్‌ నిర్మాణం

పాపన్నపేట మండలం చుట్టూరా మంజీరా నది ప్రవహిస్తుండటంతో గతంలో 30 ఏళ్ల క్రితం కొత్తపల్లి వద్ద పంప్‌హౌస్‌ నిర్మించి, అనంతుని గుట్టపై ఓవర్‌ హెడ్‌ ట్యాంకుతో సుమారు 11 గ్రామాలకు తాగునీరు అందించారు. మిషన్‌ భగీరథ వచ్చిన తర్వాత పథకం మూలన పడింది. దీంతో అక్కడ ఉన్న రెండు 40 హెచ్‌పీల కరెంట్‌ మోటార్లు పని చేయకుండా పోయాయి. మరో మోటార్‌ బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. ట్రాన్స్‌ఫార్మర్‌, ప్యానల్‌ బోర్డులకు మరమ్మతులు అవసరం. అలాగే విద్యుత్‌ కనెక్షన్‌ సరిచేసి, అక్కడక్కడా పైప్‌లైన్లకు మరమ్మతులు చేస్తే, కొన్ని గ్రామాలకు తాగు నీరు అందే అవకాశం ఉంది. పొడిచన్‌పల్లి వద్ద మంజీరా నదిలో నిర్మించిన తాగు నీటి పథకం ద్వారా ఏడుపాయలతో పాటు 11 గ్రామాలకు తాగు నీరు అందించే వారు. కమాన్‌ వద్ద నిర్మించిన ఇన్‌టెక్‌ వెల్‌ ద్వారా ఏడుపాయల భక్తులకు తాగు నీరు అందేది. మిషన్‌ భగీరథ పథకం రావడంతో అది మూలన పడింది. ఈ పథకంలో ఒక్క విద్యుత్‌ మోటార్‌ మాత్రమే పని చేస్తున్నట్లు తెలుస్తుంది. కుర్తివాడ వద్ద 2016లో మంజీరా నదిలో బావి ఏర్పాటు చేసి, మిన్‌పూర్‌ వద్ద నిర్మించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ద్వారా 9 గ్రామాలకు తాగు నీరు అందించాలని అనుకున్నారు. ఈ మేరకు మిన్‌పూర్‌ ట్యాంకు వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. కానీ అదే సమయంలో మిషన్‌ భగీరథ వినిమోగంలోకి రావడంతో పథకం ప్రారంభోత్సవానికి నోచుకోకుండానే మూలన పడింది. వీటికి మరమ్మతులు చేస్తే కొంత మేర మండలంలో దాహార్తి తీరే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement