వాన చుక్క జాడేదీ? | - | Sakshi
Sakshi News home page

వాన చుక్క జాడేదీ?

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

వేసవిని తలపిస్తున్న ఎండలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పగటి వేళ 35 డిగ్రీలకుపైగా నమోదు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికం

ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగానే ఈ నెల నుంచి వర్షాలు కురవడం లేదు. జూన్‌లో లోటు వర్షపాతం నమోదు కాగా, జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన వానలతో లోటునుంచి సాధారణ స్థితికి చేరుకోవటంతో ముప్పుతప్పిందంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తీరా సెప్టెంబర్‌లో అస్సలు వర్షాలు కురవక పోగా వేసవిని తలపించేలా ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

– మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.67 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులను సమకూర్చారు. రైతులు జూన్‌లో నారుమళ్లు (తుకాలు) పోశాక తీరా జూలైలో ఎల్‌నినో ప్రభావం ఉందని తెలియటంతో అధికారులు, వరిసాగుకు బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ జిల్లాలో 3.18 లక్షల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఈ లెక్కన అధికారుల అంచనా కన్నా 49 వేల ఎకరాల్లో సాగుతగ్గింది.

గడిచిన మూడు మాసాల్లో వర్షం ఇలా...!

జూన్‌లో 112.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 83.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 28.6 ఎం.ఎం లోటువర్షం నమోదైంది. జూలైలో 206.6 మి.మీ.కురవాల్సిఉండగా, 289.2 మి.మీ పడింది. ఈ లెక్కన 82.6 మి.మీ అధికంగా నమోదైంది. ఆగస్టులో 131.5కి బదులుగా 149.9 పడింది. దీంతో 18.4 మి.మీ అధికంగా కురిసింది. కాగా, జూన్‌లో లోటును సైతం జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలతో సాధారణం కన్నా ఎక్కువగా నమోదు కావటంతో ఎల్‌నినో ముప్పు తప్పిందని అంతా భావించారు.

సెప్టెంబర్‌లో చినుకు జాడలేదు!

ఈ సెప్టెంబర్‌లో అడపాదడపా చిరుజల్లులతోనే సరిపెట్టింది. చెప్పుకోదగ్గ ఒక్కవర్షం పడలేదు. గడిచిన వారం రోజుల్లో అధికారిక లెక్కల ప్రకారం 40.5 మి.మీ వర్షం పడాల్సి ఉండగా(–89.0) నమోదైంది. దీంతో జిల్లాపై ఎల్‌నినో ప్రభావం చూపుతోందని అందుకే వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభావం చూపుతోన్న ఎల్‌నినో

వేసవిని తలపించేలా ఎండలు!

వారంరోజులుగా ఎండలు దంచి కొడుతుండటంతో పంటపొలాలకు అధికంగా నీటి తడులు అవసరం అవుతున్నాయి. నీటి తడులు పెట్టినా ఎండల కారణంగా ఇట్టే ఆవిరైపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు కరెంట్‌ కోతలు సైతం మొదలవటంతో పంటలు ఎండుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉక్కపోతతో ఉక్కిరి... బిక్కిరి

ఎండవేడిమితో మధ్యాహ్నం వేళలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఇదేవిధంగా ఎండలు కొడితే నీటివనరుల్లోకి వచ్చిన కొద్దిపాటి సాగునీరు సైతం ఆవిరైపోయే ప్రమాదముందని, అదేజరిగితే సాగుచేసిన పంటలు చేతికందే పరిస్థితి లేకుండా పోతుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement