● అక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ● రివైజ్డ్ షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను సవరించినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరింత అవకాశం కల్పించేందుకు క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, తొలగింపులు, సవరణలు, చిరునామా మార్పు వంటి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరిస్తారని తెలిపారు. ఆగస్టు 17 నుంచి నవంబర్ 5 వరకు నోటీసుల దశ, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం, నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సవరించిన షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్ర పరిధిలో సవరించిన షెడ్యూల్‌ను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు.


