మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి
ఉమ్మడి జిల్లాలో పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు
మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 73 స్కూళ్లను ఎంపిక చేసి రూ.699.985 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులిచ్చింది. ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలకు నిధులు మంజూరు చేయడంతో వాటి రూపురేఖలు మారనున్నాయి.
– సంగారెడ్డి జోన్
ప్రైవేటు పాఠశాలల్లో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూల్స్ అందుబాటులోకి వస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గే అవకాశముంటుంది. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, మెరుగైన మౌలిక వసతులతోపాటు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, ఉత్తమ ఫలితాలు సాధించి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం, విశ్వాసం పెంపొందించడమే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఆధునిక సాంకేతికతతో కూడిన తరగతిగదులు, పౌష్టికాహారం, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు, క్రీడా మైదానాలు, పోటీ పరీక్షల కోసం గ్రంథాలయం, తదితర వసతులు కల్పించనున్నారు.
మారనున్న పాఠశాలల రూపురేఖలు
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయితే విద్యా బోధనతోపాటు క్రీడా, కంప్యూటర్ రంగాల్లో సైతం రాణించేందుకు అవకాశాలుంటాయి. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు, దౌల్తాబాద్, సంగారెడ్డిలోని మునిపల్లి, జిన్నారం, సదాశివపేట, జహీరాబాద్, నిజాంపేట, మెదక్ జిల్లాలోని మెదక్, వెల్దుర్తి మండలాల్లోని పాఠశాలలను ఎంపిక చేశారు.


