నర్సాపూర్‌లో 22 వేలు, మెదక్‌లో 18 వేలకు పైగా కోత
40
జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో 4,53,140 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా బీఎల్‌ఓలు ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. కాగా, ఇప్పటివరకు 4,12,520 మంది ఓటర్లు మాత్రమే ఫారాలు నింపి బీఎల్‌ఓలకు అప్పగించారు. ఈ లెక్కన 40,620 మంది తిరిగి ఇవ్వలేదు. ఇందులో మెదక్ నియోజకవర్గంలో 2,20,427 మంది ఓటర్లు ఉండగా, ఎన్యూమరేషన్ ఫారాలు 2,01,515 మంది మాత్రమే తిరిగి అప్పగించారు. 18,437 మంది ఓటర్లు ఇవ్వలేదు. అలాగే నర్సాపూర్‌లో 2,32,713 మంది ఓటర్లు ఉండగా, 2,06,763 మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చారు. 22,273 మంది ఇవ్వలేదు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి 40,620 మంది ఓట్లు (8.96) శాతం తొలగిపోయినట్లు లెక్క. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా, ఇప్పటివరకు మెదక్‌లో 91.42 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా, నర్సాపూర్‌లో 88.85 శాతం పూర్తయింది. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 90.10 శాతం ప్రక్రియ పూర్తి చేశారు.
మున్సిపాలిటీల్లోనే అధికం
జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో సుమారు 80 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చి పట్టణాల్లో స్థిరపడిన వారు అధికంగా ఉన్నారు. వీరికి సొంత గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో సైతం ఓటు హక్కు ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల కోరిక మేరకు పట్టణాలు, మున్సిపాలిటీల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీలలో ఎన్నికలు జరిగిన సమయంలో అక్కడా ఓటు వేస్తున్నారు. ఇలాంటి ఓట్లు 10 నుంచి 12 శాతం వరకు కలిగి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. కాగా, ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)తో వీరికి అడ్డుకట్ట పడనుంది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో జిల్లాలో 40 వేల ఓట్లు తొలగిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 22 వేలు, మెదక్‌లో 18 వేలకు పైగా ఓట్లకు కోత పడినట్లు తెలుస్తోంది. మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ‘సర్’ ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. ఇప్పటివరకు 90.10 శాతం డిజిటైలేజేషన్ పూర్తి చేశారు.
– మెదక్‌జోన్
ఆగస్టు 3 తర్వాత నోటీసులు
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి బీఎల్‌ఓలకు ఎందుకు ఇవ్వలేదనే అంశంపై వారికి నోటీసులు అందజేయనున్నారు. ఆ ఓటర్లు గతంలో రెండు ఓట్లు కలిగి ఉన్నారా..? లేకా చనిపోయారా..? ఎందుకు తిరిగి ఇవ్వలేదనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రక్రియ కొనసాగనుంది. డిజిటలైజేషన్ ప్రక్రియ కాగానే పూర్తి వివరాలు తెలుసుకుంటామని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ముమ్మరంగా సాగుతున్న ‘సర్’ ప్రక్రియ
90 శాతం డిజిటలైజేషన్ పూర్తి
మరో ఐదు రోజులు మాత్రమే గడువు


