పనులు పూర్తి చేయాలి
రామాయంపేట(మెదక్): ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా పరిధిలోని పలు గ్రామా లు, తండాల రోడ్లు దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలకు వెళ్లే రహదారులు పాక్షికంగా శిథిలమయ్యాయి. రెండు రోజుల వ్యవధిలోనే రామాయంపేటలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పట్టణంలో ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని కాలినడక కూడా కష్టతరంగా మారింది. రామాయంపేట– సిద్దిపేట ప్రధాన రఽహదారిపై పెద్ద పెద్ద గుంతలు తేలి ప్రమాదకరంగా మారింది. ఇటీవల గుంతల్లో నింపిన మట్టి, కంకర వర్షానికి కొట్టుకుపోయింది. రోడ్డుపై వదర నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిజాంపేట మండల పరిధిలోని పలు రోడ్లు దెబ్బతిన్నాయి.
కొట్టుకుపోయిన మట్టి
గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పుష్పాలవాగు ఉప్పొంగింది. పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే రహదారిలో కల్వర్టు కొట్టుకుపోగా, తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. తాజాగా కురిసిన భారీ వర్షాలకు మట్టి కొట్టుకుపోయింది. బ్రిడ్జి వద్ద రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉందని, వెంటనే మరమ్మతు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అసంపూర్తిగా రూప్‌సింగ్ తండా బ్రిడ్జి
గతేడాది కురిసిన భారీ వర్షాలకు హవేళిఘణాపూర్ మండలం రూప్‌సింగ్ తండాలో ఇద్దరు మృత్యువాత పడగా, పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిని 20 రోజుల పాటు తండాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తి తెలగిపోయాయి. దీంతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ యుద్ధ ప్రాతిపదికన వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణంతో పాటు తండాకు తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పటివరకు తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా మొరం నింపకపోవడంతో ఈ రోడ్లులో వాహనాలు వెళ్లడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో రహదారి బురదమయం కాగా, కాలినడకన సైతం వెళ్లలేకపోతున్నామని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు
ఇబ్బంది పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషి మేరకు గతంలో తండాకు తారు రోడ్డుతో పాటు బ్రిడ్జి మంజూరైంది. బిడ్జి ని ర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చినా చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది. తారు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. వెంటనే పనులు ప్రారంభించాలి.
– అనూ, సర్పంచ్, రూప్‌సింగ్ తండా


