రీ సర్వేతో భూ సమస్యలకు చెల్లు | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ సమస్యలకు చెల్లు

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

రీ సర్వేతో భూ సమస్యలకు చెల్లు వర్షాలతో జాగ్రత్త: ఎస్పీ సింగూరుకు ఇన్‌ఫ్లో నేడు జాబ్‌ మేళా రైతులను ఆదుకోండి: మాజీ ఎంపీ బీబీపాటిల్‌ నల్లవాగుకు స్వల్ప వరద

అల్లాదుర్గం(మెదక్‌): భూముల రీసర్వేతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి అన్నారు. బుధవారం మండలంలోని చేవెళ్ల గ్రామంలో రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. వందల ఏళ్లుగా భూముల సర్వే చేయలేదని, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందన్నారు. రైతులు సర్వేకు పూర్తిగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ఏడీ కిషన్‌, తహసీల్దార్‌ మల్లయ్య, సర్పంచ్‌లు మచ్చేందర్‌, వీరప్ప, ఏఓ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌జోన్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వ ర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువులు, నదుల్లోకి దిగవద్దని హెచ్చరించారు. వాహనదారులు కల్వర్టులు, వంతెనలు, వాగులను దాటేందుకు ప్రయత్నించవద్దన్నారు. చేపల వేట కోసం వెళ్లటం, సెల్ఫీలు, రీల్స్‌ కోసం వరద ప్రాంతాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తడిసిన విద్యుత్‌ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే విద్యుత్‌, పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

పుల్‌కల్‌(అందోల్‌): సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. రెండు రోజులుగా డ్యాంలోకి ఇన్‌ఫ్లో చేరుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం 637 క్యూసెక్కులు, బుధవారం 592 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. ప్రస్తుతం డ్యాంలో 4.215 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగునీటి పథకాలైన మిషన్‌ భగీరథకు, జంట నగరాల తాగునీటికి రెండు ఫేజ్‌ల ద్వారా 1877 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.

సంగారెడ్డి క్రైమ్‌: డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో పట్టణంలో ఈనెల 30వ తేదీన జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రవికిరణ్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్‌ మేళాలో అపోలో ఫార్మసీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీఫార్మసీ, డీ ఫార్మసీని కనీస విద్యార్హతగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు గురువారం ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లు, ఆధార్‌ ధ్రువపత్రాలతో పట్టణ బైపాస్‌లోని డీఆర్‌డీఓ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08455–271010 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

జోగిపేట(అందోల్‌): సింగూరు ప్రాజెక్టు నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు సాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ బుధవారం కలెక్టర్‌కు ఫోన్‌ చేశారు. సింగూరు ప్రాంత రైతులు 23 ఏళ్లుగా ప్రాజెక్టు నీటి ద్వారానే పంటలు పండించుకుంటున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. వరి పండించుకునేందుకు నీళ్లు ఇస్తే 2027లో తాగడానికి నీరు ఉండదని కలెక్టర్‌ ఆయనకు తెలిపారు. 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాజెక్టులోకి నీరు వస్తుందని రైతులు ఆదుకునే ప్రయత్నం చేయాలని బీబీ పాటిల్‌ విజ్ఞప్తి చేశారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌): ఎగువ ప్రాంతంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగులో వరద చేరుతుంది. బుధవారం నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. వరద ప్రవహం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వను పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1483 ఫీట్ల నీటి నిల్వ ఉందని అధికారులు వివరించారు. అనంతరం కల్హేర్‌లో ఎస్సీ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థుల భోజన వసతి, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, హాస్టల్‌లో స్లాబ్‌ నుంచి నీరు లీకేజీ కావడంతో పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం భవనం కొత్తగా నిర్మించేందుకు చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్‌ నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రావు, గంగారం, నాయకులు పోచయ్య, ఎండీ. సర్దార్‌, మోహన్‌రెడ్డి, జయరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement