ఏసీబీ.. దూకుడేదీ? | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ.. దూకుడేదీ?

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తుంటే.. ఉమ్మడి జిల్లాలో మాత్రం సాధారణ కేసులకే పరిమితమవుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసు గత రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కేవలం లంచం తీసుకుంటుండగా.. పట్టుబడుతున్న కేసు లే అడపాదడపా నమోదవుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఏసీబీ నమోదు చేస్తున్న ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసుల్లో కట్టల పాములు బయటకు వస్తున్నాయి. రూ. వందల కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులు, బ్యాంకు లాకర్లలో కిలోల కొద్ది బంగారం, ఖరీదైన వాహనాలు.. ఇలా కళ్లు బైర్లు కమ్మె స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఏసీబీ పనితీరు ఉంది. రూ. పది వేలు లంచం తీసుకుంటుంగా పంచాయతీ సెక్రటరీని పట్టుకోవడం, రూ.15 వేల లంచం తీసుకుంటుండగా.. మున్సిపాలిటీ బిల్లు కలెక్టర్‌ను ట్రాప్‌ చేయడం వంటి కేసులతో సరిపెడుతున్నారు. డివిజన్‌ స్థాయి అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసులు మరో నాలుగు నమోదయ్యాయి.

ఈ ఏడాదిలో ఆరు కేసులు

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏసీబీ ఉమ్మడి జిల్లాలో కేవలం ఆరు కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదైన వారిలో కొమురవెల్లి మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి, సదాశివపేట మున్సిపాలిటిలో బిల్లు కలెక్టర్‌ వంటి కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. మిగిలిన నలుగురిలో కొల్లూరు ఎస్‌ఐ, విద్యుత్‌శాఖ నర్సాపూర్‌ ఏడీఈ, ఐడీఏ బొల్లారం ఏఈఈ, చేర్యాల తహసీల్దారులు ఉన్నారు. ఈ ఆరుగురిలో చేర్యాల తహసీల్దార్‌ మి నహా మిగిలిన వారంతా రూ.పది వేలు నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారే. అక్రమాస్తుల కేసు లు నమోదు చేయాలంటే సరైన ఆధారాలు లభించాలని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే ఈ ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు.

పెద్ద తిమింగలాలపై నజరేదీ?

ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కొందరు అవినీతి ఉన్నతాధికారుల అక్రమార్జన రూ.కోట్లలో ఉంటోంది. రూ.వందల కోట్లలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రూ.కోట్లు విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులు కొందరు భారీగా అక్రమాస్తులను కూడ గట్టారు. ఎన్నికల నిబంధనల కారణంగానో, ఇతర సాధారణ బదిలీల్లో వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేసినా వారు తిరిగి ఉమ్మడి జిల్లాకే వచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ముడుపులు ముట్టజెప్పి రెవెన్యూలో మరింత కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయిలో అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నాయి. విద్యుత్‌శాఖలోని కొందరు ఇంజనీరింగ్‌ అధికారుల అక్రమార్జన అంతా ఇంత కాదు. కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు రోజువారీ అక్రమార్జనే రూ.లక్ష వరకు ఉంటోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలతో మున్సిపల్‌ అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఒకేచోట పనిచేసి బదిలీ అయిన నీటిపారుదలశాఖలోని ఓ అధికారి చెరువులకు ఎన్‌ఓసీల జారీలో చేసిన వసూళ్లు రూ.కోట్లలో ఉంటుందనేది ఆశాఖవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుశాఖలోనూ కొందరు అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల రూ.వందల కోట్లు అక్రమాస్తులు బయటపడిన బీంరెడ్డి గతంలో పటాన్‌చెరు డీఎస్పీగా పనిచేసిన విషయం విధితమే. ఇలా జిల్లాలో అవినీతి తిమింగలాలను వదిలేసి.. చిన్నా.. చితక కేసులతో ఏసీబీ సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.

రెండేళ్లుగా నమోదు కాని ఆదాయానికి మించి ఆస్తుల కేసు

జిల్లాలో పలుశాఖల్లో భారీ అవినీతి తిమింగలాలు

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసులకే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement