రామాయంపేట(మెదక్): జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణులు మృతి చెందాయి. దీంతో అటవీశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఈమేరకు మెదక్, రామాయంపేట అటవీ రేంజ్ అధికారులు విద్యాసాగర్, గణేశ్ తమ సిబ్బందితో బుధవారం మెదక్– ఎల్కతుర్తి 765 డీజీ జాతీయ రహదారిపై లక్ష్మాపూర్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సులతో పాటు లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులను ఆపి నిదానంగా వెళ్లాలని సూచించారు. ‘మీ వేగానికి హద్దు.. వన్య ప్రాణికి రక్ష, అటవీ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లండి.. మూగ జీవులను రక్షించండి’ అనే నినాదాలతో కూడిన బ్యా నర్లను ప్రదర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్, బీట్ అఫీసర్లు పాల్గొన్నారు.
వాహనదారులకు అటవీశాఖ అవగాహన


