ఫ్యూచర్‌లోకి నర్సాపూర్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌లోకి నర్సాపూర్‌

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు సర్కిళ్లు విలీనం తూప్రాన్‌, సంగారెడ్డి, గజ్వేల్‌ సర్కిళ్లను సైతం.. వాణిజ్య పన్నుల శాఖలో సమూల మార్పులు.. మూడు భాగాలుగా ఉమ్మడి జిల్లా సర్కిల్‌ కార్యాలయాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర వాణిజ్య పన్నుల (జీఎస్టీ) శాఖను పునర్‌ వ్యవస్థీకరించిన రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి డివిజన్‌ను ఫ్యూచర్‌ సిటీ సర్కిల్‌లో విలీనం చేసింది. అలాగే మెదక్‌ జిల్లాలో ఉన్న నర్సాపూర్‌, తూప్రాన్‌ డివిజన్లతోపాటు, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ డివిజన్‌ను కూడా ఫ్యూచర్‌సిటీ సర్కిల్‌లో కలిపారు. ప్రభుత్వం ఈ ఫ్యూచర్‌ సిటీ డివిజన్‌లో కొత్తగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యూచర్‌సిటీ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం విదితమే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఫ్యూచర్‌సిటీని వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించిన కొత్త డివిజన్‌గా మార్చింది. రీజనల్‌ రింగ్‌రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) లోపల (ప్యూర్‌ ఏరియా) ఉన్న డివిజన్లన్నింటినీ కూడా ఈ ఫ్యూచర్‌సిటీ సర్కిల్‌లో విలీనం చేసినట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలోని ఈ నాలుగు సర్కిళ్లు నిజామా బాద్‌ డివిజన్‌ పరిధిలో ఉండేవి. ఈ మేరకు ప్రభు త్వం ఇటీవల జీఓ నెంచి 126ను జారీ చేసింది.

నిజామాబాద్‌ డివిజన్‌లో జహీరాబాద్‌..

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ సర్కిల్‌ను మాత్రం నిజామాబాద్‌ డివిజన్‌లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మెదక్‌, సిద్దిపేట ప్యూర్‌ ఏరియా పరిధిలో ఉన్న ఆశాఖ సర్కిళ్లను కూడా నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోనే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ప్యూర్‌ ఏరియా పరిధిలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, అమీన్‌పూర్‌ సర్కిళ్లను మాత్రం శేర్‌లింగంపల్లి సర్కిల్‌లో విలీనం చేశారు. ఇలా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన సర్కిల్‌ కార్యాలయాలన్నీ మూడు భాగాలుగా విడిపోయాయి. ఈ వాణిజ్య పన్నుల శాఖకు అత్యధికంగా జీఎస్టీ చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ను సైతం శేర్‌లింగంపల్లి డివిజన్‌లో విలీనం చేశారు. ఇప్పటివరకు ఈ బీహెచ్‌ఈఎల్‌ నిజామాబాద్‌ డివిజన్‌లో కొనసాగింది.

సంగారెడ్డి నుంచే ఖజానాకు కాసుల గలగల..

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు అత్యధిక పన్ను రాబడి ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచే ఎక్కువ. ఇక్కడ పరిశ్రమలతోపాటు, వ్యాపార సంస్థల నుంచి అత్యధికంగా జీఎస్టీ, ఇతర పన్నుల ఆదాయం లభిస్తుంది. ప్రధానంగా సంగారెడ్డి సర్కిల్‌ నుంచే రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల ఉంటుంది. ఇందుకు ఇక్కడ వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే ఫార్మా, బల్క్‌డ్రగ్‌, ఇంజనీరింగ్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలే కారణం. బీహెచ్‌ఈఎల్‌తోపాటు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ భారీ పరిశ్రమలు ప్రతినెలా రూ.కోట్లలో జీఎస్టీలు, ఇతర పన్నులు చెల్లిస్తుంటాయి. అలాగే వ్యాపారులు, వ్యాపార సంస్థలు కూడా ప్రతినెలా జీఎస్టీ చెల్లింపులు ఉంటాయి. ఇలా వాణిజ్యపన్నుల రాబడిలో సంగారెడ్డి జిల్లా మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలతో పోటీ పడుతోంది. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ఈ శాఖ పునర్‌వ్యవస్థీకరణ ఇప్పుడు వ్యాపార, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement