ఎరువు బరువై | - | Sakshi
Sakshi News home page

ఎరువు బరువై

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

పాత ఎరువులు..కొత్త ధరలు వ్యాపారుల చేతి వాటం..రైతన్నల అవస్థలు ఖరీఫ్‌లో 59,870 మెట్రిక్‌ టన్నుల ఎరువుల అవసరం

మెదక్‌ అర్బన్‌: రైతన్నకు ఎరువు బరువై సాగు భారమైంది. సాగు కలిసి రాక, వచ్చిన పంటను సకాలంలో అమ్ముకోలేక దీనావస్థలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఎరువుల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో అన్నదాతలకు మరింత కుదేలవుతున్నారు. కాగా, వ్యాపారులు పాత స్టాకుకు ధరలు పెంచేసి అమ్ముతున్నారు. పైగా ఎరువులకు లింకులు పెట్టి విక్రయిస్తుండటంతో అన్నదాతల జేబును మరింత గుల్ల చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లాలో 3,67,668 ఎకరాల్లో పంటలు వేసే అవకాశం ఉండగా 59,870 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

ముందే భారీగా నిల్వలు

గల్ఫ్‌ యుద్ధం ఫలితమా అని, ఎరువుల ధరల పెంపును ముందే ఊహించిన హోల్‌సేల్‌ డీలర్లు..రిటైలర్లు భారీగా నిల్వలు పెట్టుకున్నారు. ఏప్రిల్‌ నుంచే ధర పెంపునకు తెర లేపారు. మెదక్‌ జిల్లాలో రైతులు కాంప్లెక్స్‌ ఎరువులనే ఎక్కువగా వాడుతుంటారు. అందులో 20:20:15 లాంటి వాటికి డిమాండ్‌ ఉంది. ఇది బస్తాకు రూ.200 నుంచి 400 వరకు పెరిగింది. దీంతో వేల టన్నుల్లో నిల్వలు ఉంచిన వారు రూ.1,400 ఎమ్మార్పీ ఉన్న బస్తాను రిటైలర్‌కు రూ.1,530 వరకు విక్రయించారు. ఇక రిటైలర్లు బస్తాను రూ.1,600 నుంచి రూ.1,650 వరకు అమ్ముకున్నారు. పైగా సరిగా అమ్మకాలు జరగని, లాభాలు ఎక్కువగా వచ్చే కొన్ని ఎరువులను లింకులు పెట్టి విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఈ ఎరువులు రూ.1,400 నుంచి రూ.1,800కు పెరిగాయి. ఇలా హోల్‌సేల్‌ డీలర్లు రూ.కోట్లలో,రిటైలర్లు రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. అక్రమ అమ్మకాలను అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఖరీఫ్‌కు 59,870 మెట్రిక్‌ టన్నుల ఎరువులు

జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి 3,67,668 ఎకరాల్లో పంటలు వేసే అవకాశముందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇందులో వరి పంట 3,16,690 ఎకరాల్లో వేయనున్నట్లు తెలిసింది. కాగా ఇందుకోసం సుమారు 59,870 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతుందని ఇందులో 26,500 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు మించి ఎరువులు అమ్మకూడదని జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్‌ స్పష్టం చేశారు.

బస్తాకు రూ. 200 నుంచి 400 వరకు పెంపు

పెరిగిన ఎరువుల ధరలివి

పొటాష్‌ పాత ధర రూ.1,800 నుంచి రూ.1,975కు, 20–20 రూ.1,400 నుంచి రూ.1,800లు, 12–32–15 రూ.2,025 నుంచి 2,250, సూపర్‌ ఫాస్పేట్‌ రూ.600 నుంచి 775లు, 16–16–16 రూ.1,675 నుంచి 2,050లు 24–24–0 రూ.2వేల నుంచి 2,300లు, 20–20–13 రూ.1,800 నుంచి 2,150కి పెరిగినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement