కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు నిరాశే
● జూన్ 2న ఇస్తామని ముందే ప్రకటించిన ప్రభుత్వం ● అవతరణ వేడుకల్లో ఆ ఊసెత్తని సర్కార్ ● నాలుగేళ్లుగా తప్పని ఎదురుచూపులు ● జిల్లాలో నూతన దరఖాస్తుదారులు 12,260
మెదక్‌జోన్: రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించింది. దీంతో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు సంతోషించారు. కానీ ఆ రోజు పింఛన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశకు లోనయ్యారు. మెదక్ జిల్లాలో వివిధ రకాల పింఛన్లు 1,08,402 ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఆగస్టులో చివరిసారిగా పింఛన్లు మంజూరు చేసింది. కాగా దుబ్బాక, మునుగోడు నల్గొండలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో అర్హులైన వారు చేయూత పింఛన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, సైట్‌ను నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంచింది. అలాగే ప్రజావాణిలో కొందరు, నేరుగా మరి కొందరు, ఆఫ్‌లైన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వేల మంది వివిధ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. నాలుగేళ్లుగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 12,260 మందికి చేరుకుంది. కాగా పింఛన్లకోసం దరఖాస్తు చేసుకుని ఎప్పడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు నిరాశే మిగిలింది.
జూన్ 2న, రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించటంతో జిల్లాలో వేలాది మంది దరఖాస్తుదారులు పలు ధ్రువపత్రాలు మీసేవా కేంద్రాల ద్వారా తీసుకున్నారు. ప్రధానంగా భర్తల మరణ ధ్రువీకరణ, వయస్సు నిర్ధారణ కోసం ఆధార్, సదరం క్యాంపుల్లో పొందిన వికలాంగుల ధ్రువీకరణ తదితర పత్రాలు తీసుకొని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎదురు చూసినా ఫలితం దక్కలేదు.
వృద్ధాప్య పింఛన్ పొందే వ్యక్తి చనిపోయినట్లయితే మృతుడి భార్య జీవించి ఉంటే ఆమెకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేస్తున్నారు. కానీ వయస్సు రీత్యా 65 ఏళ్లు దాటిన వారికి, సదరం క్యాంపు ద్వారా వికలాంగుల సర్టిఫికెట్ పొందిన వారికి, చిన్న వయస్సులో భర్త చనిపోయిన, ఒంటరి మహిళలు, బీడీ,గీత, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరీ చేయడం లేదు.
ఎలాంటి సమాచారం లేదు
కొత్తగా చేయూత పింఛన్ల గురించి ఎలాంటి సమాచారం లేదు. నాలుగేళ్లుగా జిల్లాలో ఆన్‌లైన్ ద్వారా 1,260 మంది ఆఫ్‌లైన్ ద్వారా సుమారు 11 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరు కాగానే లబ్ధిదారులకు అందిస్తాం.
– బీమయ్య, డీపీఎం, మెదక్


